డీకే అరుణకు.. రాజకీయ భిక్ష పెట్టింది నేనే
– అన్నా అని అడిగితే గెలిపించాం
– మహబూబ్‌నగర్ ప్రాజెక్టులు విూ పుణ్యమే అయితే ఎందుకు పూర్తిచేయలేదు?
– ప్రాజెక్టులు మొదలుకావటానికి, పూర్తికావడానికి టీఆర్‌ఎస్సే కారణం
– కేసీఆర్‌ను దించడమే లక్ష్యంగా కాంగ్రెస్, టీడీపీ పొత్తు
– 20సీట్లు కూడా మహాకూమికి రావు
– ప్రజలు ఏకమై కూటమి కుట్రలను తిప్పికొడతారు
– పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
హైదరాబాద్, అక్టోబర్13(జనంసాక్షి) : డీకే అరుణకు రాజకీయ భిక్ష పెట్టింది తానే అని టీఆర్‌ఎస్ నేత జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం టీఆర్‌ఎస్ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా డి.కె. అరుణ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అన్నా అని అడిగితే పాన్‌గల్ నుంచి డీకే అరుణను గెలిపించానని అన్నారు. ఇప్పుడు డీకే అరుణ సిగ్గు, శరం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. స్వయం కృషితో ఒక క్లర్క్ స్థాయి నుంచి… ఈ స్థాయికి వచ్చానని అన్నారు. నేను బ్యాంకు నుంచి నిబంధనల ప్రకారం అప్పు తీసుకున్నానని, మళ్లీ కట్టేశానని జూపల్లి తెలిపారు. చిన్నారెడ్డి, మల్లు రవి, జగదీష్ రెడ్డిలు వచ్చి నన్ను అప్పుడు అడిగారని, పాన్‌గల్ జెడ్పీటీసీ స్థానం కోసం… అప్పుడు అన్నా అని అడిగితే తాను పాన్‌గల్ నుంచి డీకే అరుణను గెలిపించానన్నారు.
అరుణ కుటుంబానికి అన్నీ దొంగ తెలివి తేటలే అని వ్యాఖ్యానించారు. గద్వాలలో ఏ చెట్టూ, పుట్టనడిగినా
డీకే అరుణ కుటుంబం అక్రమ దందాల గురించి చెబుతాయి. తెలంగాణను వ్యతిరేకించిన కిరణ్ కేబినెట్‌లో డీకే అరుణ ఉన్నారని గుర్తుచేశారు. పాలమూరు ప్రాజెక్టులను వ్యతిరేకిస్తున్న చంద్రబాబుతో పొత్తు జిల్లా నేతలు సమర్ధించడం సిగ్గుచేటన్నారు. పొరపాటున కూటమి అధికారంలోకి వస్తే ప్రాజెక్టులు ఆగిపోతాయని జూపల్లి కృష్ణారావు తెలిపారు. కాంగ్రెస్ లీడర్లు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా ఆ పార్టీ అధికారంలోకి రావడం కలనే అని అన్నారు. తాను కాంగ్రెస్ నేతల్లాగా.. ప్రజల రక్తమాంసాలు తినే పులిని కాదని స్పష్టం చేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని.. వందలాది మంది పోలీసులను పెట్టినా.. గద్వాల పాదయాత్ర చేసి అరుణ బండారం బయటపెట్టానని జూపల్లి గుర్తు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాజెక్టులు మా పుణ్యమే అని డీకే అరుణ అంటున్నారని, మరి విూ పుణ్యమైతే అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రాజెక్టులు మొదలు కావడానికి, పూర్తి కావడానికి గులాబీ జెండానే కారణమని తేల్చిచెప్పారు. 2001లో గులాబీ జెండానే పుట్టకపోయి ఉంటే.. తెలంగాణకు మరింత అన్యాయం జరిగే ఉందేదన్నారు. కాంగ్రెస్‌కు ఓటేందుకు వేయాలని జూపల్లి ప్రశ్నించారు. నాడు తెలంగాణ ఉద్యమంలో కలిసిరాకుండా.. పదవుల కోసం పాకులాడినందుకు వేయాలా? 24 గంటలు కరెంట్ ఇవ్వనందుకా? సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకుంటున్నందుకా? అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలే బుద్ది చెబుతారని తెలిపారు. ప్రజలకు వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ పార్టీని 2014లో ఓడించారు. ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమని జూపల్లి స్పష్టం చేశారు. అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ నేతలు మాయమాటలు చెబుతున్నారని విమర్శించారు. యువత విూద కాంగ్రెస్ నేతలకు ఎక్కడ లేని ప్రేమ వస్తోందని, ఎవరూ కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితి లేరన్నారు. కేసీఆర్‌ను దించడమే లక్ష్యంగా కాంగ్రెస్, టీడీపీలు పొత్తు పెట్టుకుంటున్నాయని విమర్శించారు. మహబూబ్ నగర్ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తున్న చంద్రబాబుతో పొత్తును జిల్లా నేతలు వ్యతిరేకించకుండా సమర్ధించడం సిగ్గు చేటన్నారు. ఈ కాంగ్రెస్‌కు 20 కాదు కదా రెండు సీట్లు కూడా గెలవదని, కాంగ్రెస్‌కు తెలంగాణ ప్రజలు గోరీ కట్టారన్నారు. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సాధించిన ఫలితాలే ఈ ఎన్నికల్లో కూడా పునరావృతం అవుతాయని జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌కు బలం ఉంటే టీడీపీతో పొత్తు ఎందుకని జూపల్లి సూటిగా ప్రశ్నించారు.