డీజిల్‌ ధరల పెంపుకు నిరసనగా..

ట్రక్కు ఆపరేటర్ల సమ్మె

– నిలిచిపోయిన 90లక్షల ట్రక్కుల రాకపోకలు

న్యూఢిల్లీ, జూన్‌18(జ‌నం సాక్షి) : పెరుగుతున్న డీజిల్‌ ధరలకు నిరసనగా దేశవ్యాప్తంగా ట్రక్కు యజమానులు, ఆపరేటర్లు సోమవారం నుంచి నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ మేరకు ఆల్‌ ఇండియా కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ గూడ్స్‌ వెహికల్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు చన్నారెడ్డి విూడియాకు తెలిపారు. దీంతో దాదాపు 90లక్షల ట్రక్కుల రాకపోకలు నిలిచిపోయాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం వల్లే దేశంలో చమురు ధరలను పెంచుతున్నట్లు ప్రభుత్వం చెబుతూ వస్తోంది. కానీ అంతర్జాతీయ ధరల వల్ల కాదు.. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న అత్యధిక పన్నుల వల్లే చమురు ధరలు పెరుగుతున్నాయి’ అని అసోసియేషన్‌ ఆరోపిస్తోంది. డీజిల్‌, పెట్రోల్‌ ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావాలని ట్రక్కు ఆపరేటర్లు డిమాండ్‌ చేస్తున్నారు. ఇక థర్డ్‌ పార్టీ బీమా ప్రీమియంను కూడా ఏటా పెంచే సంప్రదాయాన్ని మార్చాలని అసోసియేషన్‌ కోరుతోంది. తమ డిమాండ్లను నెరవేర్చేదాకా సమ్మె ఆపబోమని స్పష్టం చేసింది. కాగా.. సమ్మె నేపథ్యంలో పలు వస్తువుల సరఫరాకు అంతరాయం ఏర్పడింది.