డెంగీ వ్యాధిపై భయాందోళన చెందవద్దు

– మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
– మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రిని తనిఖీచేసిన మంత్రి
మహబూబ్‌నగర్‌, సెప్టెంబర్‌5  (జనం సాక్షి ) :   డెంగీ వ్యాధిపై ప్రజలు భయాందోళన చెందవద్దని రాష్ట్ర ఎక్సైజ్‌ క్రీడా శాఖ మంత్రి వి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. వైరల్‌ జ్వరాలే అధికంగా ఉన్నాయని, వాటిని డెంగీ జ్వరంగా భావించి ప్రజలు భయపడుతున్నారన్నారు. మహబూబ్‌ నగర్‌ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని ఎంపీ మన్నె శ్రీనివాస్‌ రెడ్డితో కలిసి మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గతంతో పోలిస్తే జిల్లా ప్రధాన ఆస్పత్రిలో సదుపాయాలు మెరుగుపడ్డాయని, ఓపీ కౌంటర్ల సంఖ్యనూ పెంచామన్నారు. ఆస్పత్రికి జ్వర పీడితులు
అధిక సంఖ్యలో వస్తుండటంతో అక్కడి పరిస్థితులు, రోగులకు అందుతున్న సౌకర్యాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జ్వరాలకు సంబంధించిన వార్డులకు వెళ్లి ఇన్‌పేషంట్లను దవాఖానలో అందుతున్న వైద్యసేవలపై రోగులను ఆరా తీశారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ..  దవాఖానలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓపీ చూస్తున్నారన్నారు. దవాఖానకు వచ్చిన రోగులు వైద్యసేవలు పొంది అరగంటలో వెళ్లేలా ఏర్పాట్లు చేయడం జరిగిందని, వారికి కావాల్సిన మంచినీటి వసతి, కుర్చీలు, టాయిలెట్‌ సౌకర్యం వంటివి, ఇతర ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని వైద్యులను ఆదేశించారు.