డోర్నకల్‌లోనూ కుదరని ఏకాభిప్రాయం
రెడ్యానాయక్‌కు టిక్కెట్‌పై సత్యవతి కినుక
కెసిఆర్‌తో చర్చించాకే నిర్ణయమని ప్రకటన
మహబూబాబాద్,సెప్టెంబర్15(జనంసాక్షి): డోర్నకల్ శాసనసభ స్థానం నుంచి తెరాస అభ్యర్థిగా తాజా మాజీ శాసనసభ్యుడు రెడ్యానాయక్ పేరు ఖరారైన నేపథ్యంలో మాజీ శాసనసభ్యురాలు సత్యవతి తన వర్గం ముఖ్య కార్యకర్తలతో రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. పలువురు ముఖ్యకార్యకర్తలతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో మండలంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి విషయం తెరాస అధినేత కేసీఆర్ దృష్టికి తీసుకెళతానని చెప్పినట్లు తెలుస్తోంది.
మరోవైపు రెడ్యానాయక్ కూడా ఆమెను కలసి మద్దతు ఇవ్వాలని కోరారు. తెరాస అధినేత కేసీఆర్ స్వయంగా టికెట్ ప్రకటించారని, త్వరలో జరగనున్న ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని సత్యవతి రాథోడ్‌ను కోరారు. కేసీఆర్ ఆదేశాల మేరకు ఐక్యంగా కలిసి తెరాసను గెలిపించుకుందామని బుజ్జగించారు. స్పందించిన సత్యవతి రాథోడ్ విూ కంటే ముందు 2014లో నన్ను పార్టీలో చేర్చుకొని టికెట్ ఇస్తామని చెప్పారన్నారు. కేసీఆర్‌తో మాట్లాడిన తరువాత నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలతో చర్చించి తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఆమె పేర్కొన్నారు. తెరాస నుంచి రెడ్యానాయక్‌కు టికెట్ ఇస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించడంతో డోర్నకల్ నియోజకవర్గంలో పలుమార్పులు చోటు చేసుకున్నాయి. కొన్ని రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ మాజీ ఎమ్మెల్యే సత్యవతిరాథోడ్‌ను కలిసేందుకు పెద్దతండాకు వెళ్లారు. ముందస్తు సమాచారంతో ఆమె కలవకుండా హైదరాబాద్ వెళ్లారు. మరోమారు ముందుగానే ఆమెకు తెలియకుండా నేరుగా సత్యవతిరాథోడ్ ఇంటికెళ్లి కూర్చున్నారు.రెడ్యానాయక్ అప్పటికే ఇంటి వద్ద వేచి ఉండడంతో తప్పని పరిస్థితుల్లో ఆమె ఇంటికెళ్లారు. దీంతో ఇద్దరూ తాజా పరిస్థితులను చర్చించడమే గాకుండా ఎవరి అభిప్రాయాలను వారు చెప్పారు.