డ్యుకేషన్ హబ్ గా గజ్వేల్
గజ్వేల్ : గజ్వేల్ నగర పంచాయతీలో ముఖ్యమంత్రి పర్యటించారు. పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాలను, ఆస్పత్రిని పరిశీలించారు. ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్, ఆడిటోరియం, రైతు బజార్ నిర్మాణం కోసం స్థల పరిశీలన చేశారు. పాండవుల చెరువును సందర్శించారు. ఆ తర్వాత ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లో అధికారులతో సీఎం సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా అధికారులతో విడివిడిగా భేటీ అయి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి అధికారులకు సీఎం కేసీఆర్ పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, కలెక్టర్ రాహుల్ బొజ్జా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
గజ్వేల్ నగర పంచాయతీ పరిధిలోని సంగాపూర్ ప్రాంతాన్ని ఎడ్యుకేషన్ హబ్ గా మార్చాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. జూనియర్, డిగ్రీ కాలేజ్ సహా అన్ని రకాల ప్రభుత్వ విద్యా సంస్థలను అక్కడికి చేర్చేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఇప్పుడున్న జూనియర్ కాలేజ్ ఆవరణలో వెజ్, నాన్ వెజ్ మార్కెట్ ఏర్పాటు చేయాలన్నారు. మిల్క్ సెంటర్ ప్రాంగణంలో 500, 1000 మంది సామర్థ్యంతో రెండు ఆడిటోరియాలను నిర్మించాలని ఆదేశించారు. పాండవుల చెరువుకట్టను మినీ ట్యాంక్ బండ్ గా తీర్చిదిద్దాలన్నారు. గజ్వేల్ నుంచి ప్రజ్ఞాపూర్ వరకు రోడ్డు వెడల్పు చేసి ఫుట్ పాత్ లు నిర్మించాలని సూచించారు. కోట మైసమ్మ ఆలయం నుంచి పట్టణంలోని ఇందిరా పార్క్ చౌరస్తా వరకు రోడ్డు విస్తరణ చేపట్టి ఫుట్ పాత్ లు కట్టాలన్నారు. ముట్రాజ్ పల్లి వరకు అదే తరహాలో రోడ్డు, ఫుట్ పాత్ వేయాలని సూచించారు.
గజ్వేల్ డిగ్రీ కాలేజ్ సంగాపూర్ ఎడ్యుకేషన్ హబ్ కు మారుతుంది కాబట్టి, ఆ స్థలంలో అద్భుతమైన ఆస్పత్రి కట్టాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అందులో అత్యాధునిక వైద్య సౌకర్యాలు, వంద పడకలు ఉండాలన్నారు. ఆరున్నర ఎకరాల విశాలమైన స్థలం చూసి ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ నిర్మించాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలన్నీ అందులోనే ఉండాలని చెప్పారు. తహశీల్దార్ ఆఫీస్ కూడా అక్కడికే తరలించి, ఆ స్థలంలో పోలీస్ కాంప్లెక్స్ నిర్మించాలని సూచించారు. నిర్మాణాల విషయంలో రాజీ పడొద్దని, 40 ఏండ్ల మన్నికతో పటిష్టంగా కట్టాలని సీఎం అధికారులకు స్పష్టం చేశారు. అంతకుముందు సీఎం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ములుగు, జగదేవ్ పూర్ మండలాలకు చెందిన 8 మంది దళిత మహిళలకు మూడెకరాల చొప్పున వ్యవసాయ భూమిని అందజేశారు.