” డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుబడితే కఠిన చర్యలు తప్పవు – సైబరాబాద్ పోలీస్ బాస్ స్టీఫెన్ రవీంద్ర “
శేరిలింగంపల్లి, అక్టోబర్ 15( జనంసాక్షి): డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఎవరైనా పట్టుబడితే వారిపై కఠిన చర్యలు తప్పవని సైబరాబాద్ పోలీస్ బాస్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టంచేశారు. ఈ మేరకు శనివారం సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శుక్రవారం సైబరాబాద్ పరిధిలో మెగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహణ కార్యక్రమంలో భాగంగా మొత్తం 283 కేసులు నమోదవ్వడం జరిగిందన్నారు. సైబరాబాద్ కమిషనర్ పరిధిలో మొత్తం 6 ప్రదేశాలలో 120 ట్రాఫిక్ సిబ్బందితో డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఇలా పట్టుబడిన డ్రంక్ అండ్ డ్రైవర్స్ ని కోర్టుముందు ప్రవేశపెట్టి చట్ట ప్రకారం తీసుకోవాల్సిన చర్యలను చేపడతామన్నారు. శుక్రవారం జరిగిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో 210 ద్విచక్ర వాహనాలు, 63 కార్లు, ఇతర ఫోర్ వీలర్స్, ఆటో రిక్షాలు, ఇతర త్రీ వీలర్స్ 7, మూడు హెవీ వెహికల్స్ కట్టుబడడం జరిగిందని సిపి వివరించారు. ఈ నెలలో ఇప్పటివరకు 3122 కేసులను నమోదు చేయడం జరిగిందని, డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన 1586 మందిని కోర్టులో హాజరు పరచడం జరిగిందన్నారు. ఇందులో 1549 మంది నిందితులకు 50 లక్షల 77 వేల ఎనిమిది వందల రూపాయలను గరిమానాగా విధించడం జరిగిందని, 35 మందికి జరిమానా, వేలు శిక్షణ కూడా విధించడం జరిగిందని, నేర తీవ్రతను బట్టి ఒకరికి ఆరురోజుల జైలు శిక్షను విధించడం జరిగిందని సిపి స్టీఫెన్ రవీంద్ర స్పష్టంచేశారు. పరిస్థితులను, సందర్భాలనుబట్టి మద్యం సేవించాల్సివస్తే ఇతరుల వాహనాల పైన ప్రయాణించడము, వేరే డ్రైవర్ ను పెట్టుకొని రాకపోకలు సాగిస్తే తమకేమీ అభ్యంతరం లేదన్నారు. ఎవరైనా సరే తాగి రోడ్ల పైన వాహనాలు నడుపుతున్నా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవని, ఇందులో ఎవరికీ ఎలాంటి మినహాయింపు లేదని పోలీస్ బాస్ స్పష్టంచేశారు. ఈకార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.