డ్రగ్స్ కట్టడికి ముఖ్యమంత్రులు ప్రాధాన్యం ఇవ్వాలి :
` సదరన్ జోనల్ కౌన్సిల్ భేటీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా
అమరావతి,నవంబరు 14(జనంసాక్షి): డ్రగ్స్ కట్టడికి ముఖ్యమంత్రులు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరారు. ఆదివారం తిరుపతిలో అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ భేటీ జరిగింది. మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు జరగ్గా.. దక్షిణ భారతదేశానికి చెందిన పలువురు సీఎంలు, మంత్రులు, ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా 51 పెండిరగ్ సమస్యలకు 40 పరిష్కారమైనట్లు కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు. కౌన్సిల్ సమావేశంలో ఏపీ సీఎం జగన్ ప్రారంభోపన్యాసం చేయగా.. చివరగా అమిత్ షా ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాలు కొవిడ్ టీకా రెండో డోసు పంపిణీని వేగవంతం చేయాలని, ముఖ్యమంత్రులు, అధికారులు పురోగతిని సవిూక్షించాలని కోరారు. భారత ప్రభుత్వం ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌ల సవరణ ప్రక్రియను ప్రారంభించిందని చెప్పారు. అధికారులు, నిపుణులతో సవరణల కోసం రాష్ట్రాలు తమ ఇన్‌పుట్స్‌ను సమర్పించాలని సూచించారు. మాదక ద్రవ్యాల వినియోగం యువత జీవితాలను నాశనం చేస్తుందన్న కేంద్రమంత్రి వాటికి కట్టడికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. డ్రగ్స్ కేసులను విచారణను వేగవంతం చేయాలని, ఇందుకు స్వతంత్ర విచారణ సంస్థలను ఏర్పాటు చేయాలన్నారు.