డ్రగ్స్‌ రవాణా ఆధారాలు ఇవ్వండి

ధూళిపాళ్లకు పోలీసులు నోటీసులు
ప్రభుత్వ తీరుపై మండిపడ్డ చినరాజప్ప
గుంటూరు,అక్టోబర్‌8(జనంసాక్షి) : టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు కాకినాడ పోలీసులు శుక్రవారం నోటీసులు అందజేశారు. ఈ నెల నాలుగో తేదీన ఆయన విూడియా సామవేశంలో డ్రగ్స్‌ రవాణా వ్యవహారంలో ప్రభుత్వానికి, పోలీసులకు గంజాయి వ్యాపారులతో సంబంధం ఉందంటూ చేసిన ఆరోపణ లపై ఆధారాలు ఇవ్వాలంటూ నోటీసులో పేర్కొన్నారు. కాకినాడ నుంచి గుంటూరు జిల్లా చింతలపూడి లోని నరేంద్ర ఇంటికి వచ్చి పోలీసులు నోటీసును అందజేశారు. ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను వారం రోజుల్లో అందజేయాలని నోటీసులో పేర్కొన్నారు. అయితే ఏపీలో అంబెద్కర్‌ రాజ్యాంగం నడవడం లేదని, రాజారెడ్డి రాజ్యాంగం మాత్రమే నడుస్తోందని టీడీపీ నేత, మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. శుక్రవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ డ్రగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని వదిలి.. ధూళిపాళ్లకు పోలీసులు ఎలా నోటీసులు ఇస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ పాలన మొత్తం ప్రతిపక్షాలను ఎలా తొక్కాలి అనే పనిగా పెట్టుకుందన్నారు. ప్రజల పక్షాన ఉండే ప్రతిపక్షాల నోరు నొక్కే ప్రయత్నం వైసీపీ నేతలు చేస్తున్నారని మండిపడ్డారు. తప్పులు జరుతున్నాయి అంటే.. వాటిని అరికట్టకుండా సాక్షాలు ఇవ్వాలని పోలీసులు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఎన్‌ఐఏ దర్యాప్తు ప్రారంభం కాక ముందే డ్రగ్స్‌తో ఏపీకి సంబంధం లేదని వైసీపీ నేతలు అంటున్నారని విమర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని చినరాజప్ప అన్నారు. ప్రతిపక్ష నేతలను భయబ్రాంతులకు గురి చేయడానికే ఇలాంటి నోటీసులు ఇస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజల అందరూ డ్రగ్స్‌ గురించే మాట్లాడుతున్నారని, శాంతి భద్రతలు పూర్తిగా క్షిణించాయన్నారు. పోలీస్‌ యంత్రాంగానికి వైసీపీపై స్వామి భక్తి ఎక్కువైందని చినరాజప్ప ఎద్దేవా చేశారు.