డ్రైవర్ల, క్లీనర్ల సమస్యలపై చర్చలు సఫలం

నిజామాబాద్‌, జూలై 18 : గత రెండు నెలలుగా ప్రైవేటు స్కూలు బస్సుల డ్రైవర్లు, క్లీనర్లు చేసిన పోరాటం విజయవంతమైంది. విద్యా సంస్థల యాజమాన్యాలు, సంఘ ప్రతినిధుల చర్చలు విజయవంతమయ్యాయి. బుధవారం స్థానిక సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి మల్యాల గోవర్ధన్‌ మాట్లాడుతూ, డ్రైవర్‌, క్లీనర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కొనసాగించిన పోరాటం సఫలమైంది. ఇది కార్మికుల విజయమని ఆయన అన్నారు. డ్రైవర్లకు, క్లీనర్లకు కనీస వేతనాలు ఫోర్‌ వీల్‌ నడిపే బస్సు డ్రైవర్లకు రూ.5800 రూపాయలు, సిక్స్‌ వీల్స్‌ నడిపే డ్రైవర్లకు 6800 రూపాయలు, క్లినర్లకు ప్రస్తుతం ఉన్న వేతనంపై 600 రూపాయలు అదనంగా పెంచుతూ అమలు చేస్తున్నామని యాజమానులు తెలిపారని ఆయన అన్నారు. వీటితో పాటు పిఎఫ్‌,ఈఎస్‌ఐ కార్మికులకు వర్తింపజేసేలా అమలు చేసామని యాజమానులు హమీ ఇచ్చినట్లు తెలిపారు. డ్రెస్‌కోడ్‌ను సైతం అమలు చేసి సంవత్సరానికి రెండు జతల బట్టలను ఇవ్వాలని అన్నారు. డ్రైవర్లు, క్లీనర్లుగా పనిచేస్తున్న వారికి వారి పిల్లల్లో ఒకరికి ఉచితంగా విద్యను అందించాలని అన్నారు. యాజమానులు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. చర్చలకు సహకరించిన యాజమానులకు కార్మిక శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో ప్రైవేటు విద్యాసంస్థల బస్సు డ్రైవర్లు, క్లీనర్ల యూనియన్‌ అధ్యక్షుడు సిరాజ్‌, కార్యదర్శి జయరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు