ఢల్లీికి గులాములం కాబోము

` వారి పరిపాలనకు తమిళనాడు ఎన్నటికీ తలొగ్గదు
` భాషా వివాదం నేపథ్యంలో ఇప్పటికే ఆ విషయాన్ని కేంద్రానికి తెలియజేశాం
` సీఎం స్టాలిన్‌
చెన్నై(జనంసాక్షి):తమిళనాడులో 2026లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటవుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్‌ స్పందించారు. దిల్లీ పరిపాలనకు లొంగని ప్రత్యేకత తమిళనాడుకు ఉందని.. భాషా వివాదం నేపథ్యంలో ఇప్పటికే ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశామన్నారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా పార్టీలను చీల్చడం, ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం ఇక్కడ కుదరదని వ్యాఖ్యానించారు. 2026 ఎన్నికల్లో కూడా తమ పార్టీనే అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు.తమిళనాడుకు నీట్‌ నుంచి మినహాయింపు ఇస్తామని.. త్రిభాషా సూత్రాన్ని అమలు చేయబోమని అమిత్‌ షా హామీ ఇవ్వగలరా అని ప్రశ్నించారు. డీలిమిటేషన్‌ (పార్లమెంటరీ ఎన్నికల్లో)తో సీట్లను తగ్గించమని చెప్పగలరా అని నిలదీశారు. ఇటీవల కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తమిళనాడు ప్రజలను కించపరిచేలా మాట్లాడారని.. అమిత్‌షా సైతం అదే విధమైన వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. రాజ్యాంగం ప్రకారమే కేంద్రం, రాష్ట్రాలు ఏర్పాటయ్యాయని.. ఎవరూ ఎవరికి సబార్డినేట్‌ కాదని రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ పేర్కొన్నారని పునరుద్ఘాటించారు.వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేయనుంది. 2026లో తమిళనాట అధికారంలోకి వస్తామని భాజపా అగ్రనేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా.. జాతీయ విద్యలో త్రిభాషా సూత్రం, డీలిమిటేషన్‌ మొదలైన విషయాలపై తమిళనాడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో తీవ్రంగా తలపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టాలిన్‌ ప్రభుత్వం.. కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై విస్తృతంగా పోరాటం చేస్తోంది.దీని కోసం ఇటీవల ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రాల స్వయం సాధికారత కోసం అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌ నేతృత్వంలో ఈ కమిటీ పని చేస్తుందని తెలిపారు. రాష్ట్రాల చట్టబద్ధ హక్కులను పరిరక్షించడంతోపాటు కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలను మెరుగుపరచడమే ఈ కమిటీ లక్ష్యమని స్టాలిన్‌ వివరించారు.

తాజావార్తలు