ఢిల్లీలో తెలంగాణ హాట్..హాట్..
న్యూఢిల్లీ, జనవరి 3 (జనంసాక్షి) :
దేశ రాజధానిలో తెలంగాణపై చకచకా పావులు కదులుతున్నాయి. గురువారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ముఖ్యులతో ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ భేటీ అయ్యారు. ప్రత్యేక తెలంగాణపై ఎలాంటి వైఖరి అనుసరించాలి, చేపట్టాల్సిన చర్యలేమిటో వారితో చర్చించారు. సమావేశానికి హాజరైన కేంద్ర మంత్రులు సుశీల్‌కుమార్ షిండే, చిదంబరం, ఏకే ఆంటోని, గులాంనభీ ఆజాద్, సోనియా వ్యక్తిగత సలహాదారు అహ్మద్ పటేల్ తెలంగాణ తేల్చాల్సిందేనని మేడక్‌కు సూచించారు. వారి అభిప్రాయాలు సాంతం విన్న సోనియా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. 2009 డిసెంబర్ 9న మనమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించాం కదా? మనమే వెనక్కి తగ్గితే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లవా అంటూ ప్రశ్నించారని సమాచారం. భేటీలో పాల్గొన్న ముఖ్యులంతా ఆమె అభిప్రాయంతో ఏకీభవించినట్లు తెలిసింది. ఈ అంశంపై హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గత నెల 28న నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలోని వివిధ పార్టీల అభిప్రాయాలు కూడా భేటీ చర్చించినట్లు తెలిసింది. అన్ని పార్టీలు వీలైనంత త్వరగా తెలంగాణపై తేల్చాలని కోరడంతో ఇంకా జాప్యం చేయవద్దని సోనియా అన్నట్లుగా తెలిసింది. మినీ కోర్ కమిటీ భేటీపై మీడియాకు ముందస్తు సమాచారం ఉండటంతో ఢిల్లీలో తెలంగాణ అంశం హాట్ హాట్‌గా మారింది. సమావేశం తర్వాత ఏపీ పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణకు ఫోన్ చేసిన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనభీ ఆజాద్ విజయవాడలో ఈనెల 7న నిర్వహించ తలపెట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ సదస్సును వాయిదా వేసుకోవాలని సూచించారు. ఇది కూడా తెలంగాణకు అనుకూలమేన నిర్ణయమే అనే ప్రచారం సాగడంతో ఎవరి నోట విన్నా తెలంగాణ చర్చే వినిపించింది.