ఢిల్లీలో పారాహుషార్
– వైమానిక దాడుల హెచ్చరికలు
న్యూఢిల్లీ, నవంబర్28(జనంసాక్షి):
ఇప్పటి వరకు రాష్ట్రాలకు ఉగ్రముప్పుందన్న సంగతెలా ఉన్నా ఇప్పుడు దేశరాజధాని దిల్లీపై ఉగ్రవాదులు వైమానిక దాడులు జరిపే అవకాశం ఉందని కేంద్ర ¬ం శాఖ హెచ్చరించింది. దీంతో కేంద్రం అప్రమత్తం అయ్యింది. ఐఎస్ సహా పలు ఉగ్ర సంస్థల నుంచి దిల్లీకి ముప్పు ఉందని తెలిపింది. దిల్లీలోని 15 కీలక ప్రాంతాలు ఉగ్రవాదుల లక్ష్యంగా ఉన్నాయని భద్రతా ఏజెన్సీల నివేదికల్లో వెల్లడైందని చెప్పింది. వారి లక్ష్యాల్లో ప్రధాని నివాసం, రాష్ట్రపతి భవన్, ఉపరాష్ట్రపతి నివాసం, ¬ం మంత్రి నివాసం, రాజ్‌పథ్, ఇండియా గేట్, సీజీఓ కాంప్లెక్స్, సీబీఐ, సీఐఎస్‌ఎఫ్, బీఎస్‌ఎఫ్ ముఖ్య కార్యాలయాలు సైతం ఉన్నాయని తెలిపింది. డ్రోన్లు, మానవ రహిత విమానాల ద్వారా వారు దాడులకు దిగే అవకాశాలు ఉన్నట్లు తెలిసిందని చెప్పింది. దీంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇప్పటికే పార్లమెంట్ ప్రారంభంకాగా సోమవారం నుంచి పూర్తిస్థాయిలో సమావేశాలు జరుగనున్నాయి. ఈ దశలో ఎంపిలు, మంత్రులు అంతా ఢిల్లీలోనే ఉండనున్నారు. దీంతో ప్రత్యేకభద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ఉగ్రవాదుల నుంచి ప్రమాదం పొంచి ఉందని నిఘా వర్గాలు ఇచ్చిన హెచ్చరికలతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఓ హెచ్చరిక మెయిల్‌ని తీర ప్రాంత భద్రత దళాలు, నేవీ, కోస్ట్ గార్డులకు పంపింది. దీంతో తమిళనాడులోని రామనాథపురం జిల్లా సముద్ర తీరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. రామేశ్వరం తీరం నుంచి ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తమయిన నేపథ్యంలో ఆ ప్రాంతమంతా భద్రతా దళాలు పహారా కాస్తున్నాయి. చెన్నై నుంచి పెద్ద యుద్ధ నౌకను నేవీ దళాలు రామేశ్వరం తీరానికి పంపించాయి. అలాగే మరికొన్ని బోట్లలో భద్రతా దళాలు సముద్రంలో గస్తీ చేపట్టాయి. సముద్ర తీరంలో డేగ కళ్లతో నిఘా పెట్టామని ఇప్పటి వరకు ఎలాంటి అనుమానిత సంఘటనలూ చోటుచేసుకోలేదని భద్రతా వర్గాలు తెలిపాయి. అలాగే సముద్రతీర ప్రాంతాలతో పాటు ఆకాశ మార్గంలోనూ భద్రత కట్టుదిట్టం చేశారు. ఎక్కడ అనుమానిత వ్యక్తులు ఉన్నా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.