ఢిల్లీలో మరో ప్రత్యూష

1

– ఏడు నెలలుగా చిత్రహింసలు

గుర్గావ్‌ (న్యూఢిల్లీ), అక్టోబర్‌ 15 (జనంసాక్షి):

చిన్నారులతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్న ప్రబుద్ధులు ఇంకా దేశంలో కోకొల్లలుగా ఉన్నారు. ఢిల్లీ చేరువలోని గుర్గావ్‌లో అలాంటి అమానుష హింసకు గురైన 14 ఏళ్ల బాలికను ఓ స్వచ్చంధ సంస్థ రక్షించగలిగింది. ఆ బాలిక స్వస్థలం జార్ఖాండ్‌ రాష్ట్రం. పేదరికంలో మగ్గుతున్న ఆమె తల్లిదండ్రులను ఒప్పించి బాలిక మేనమామ గుర్గావ్‌లోని ఓ వ్యాపారవేత్త ఇంట్లో 7 నెలల క్రితం పనిలో పెట్టాడు. అక్కడ ఆ చిన్నారికి దారుణమైన పిరిస్థితులు ఎదురయ్యాయి. యజమానుల అమానుష ప్రవర్తన నరకమే చూపించింది. చివరికి ఓ స్వచ్చంధ సంస్థ సహాయంతో ఆ అమ్మాయి బయటపడింది.

బాధిత బాలిక దుస్థితి గురించి కొన్నాళ్ల క్రితం ఢిల్లీలోని శక్తివాహిణి అనే స్వచ్చంధ సంస్థకు సమాచారం అందింది. వారు పోలీసుల సహాయంతో బాలికను రక్షించేందుకు ప్రయత్నించారు. మొదట వారికి ఆ ఇంట్లో బాలిక ఆచూకీ తెలియకపోవడంతో వెనుతిరిగారు. రెండోసారి పోలీస్‌ హెల్ప్‌ లైన్‌కు కాల్‌ వచ్చింది. దీంతో పోలీసులు, స్వచ్చంధ సంస్థ కార్యకర్తలు ఆ ఇంటిని క్షుణ్ణంగా గాలించారు. చివరికి ఆ బాలిక తాళం వేసి ఉన్న గదిలో స్పృహలేని స్థితిలో కనిపించింది. బాలిక శరీరంపై చాలా గాయాలు ఉన్నాయి. తనను యజమానులు విపరీతంగా కొట్టేవారని ఆ అమ్మాయి చెప్పింది. రోజు మొత్తానికి రెండు రొట్టెలు మాత్రమే పెట్టేవారని చెప్పింది. పోలీసులు గాలిస్తున్నారని తెలిసి గదిలో పెట్టి తాళం వేశారని బాలిక తెలిపింది. పోలీసులు వ్యాపారి కుటుంబంపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వ్యాపారవేత్త ఢిల్లీలో లేకపోవడంతో అతని భార్యను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.