ఢిల్లీలో మోడీకి చుక్కెదురు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6 (జనంసాక్షి):
ఢిల్లీలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి చుక్కెదురైంది. మీ పాఠాలు మాకు అక్కర్లేదంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం దేశ రాజధాని ఢిల్లీలోని శ్రీరాం కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌లో బినెస్‌ కాంక్లేవ్‌-2013 అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుపరిపాలన అభివృద్ధి తదితర అంశాలపై విద్యార్థులు అడిగే ప్రశ్నలకు నరేంద్రమోడీ సమాధానాలు ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతుండగా కొంతమంది ఏఐఎస్‌ఎఫ్‌ విద్యార్థులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. 2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్ల గురించి తెలియజేయాలని వారు డిమాండ్‌ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి విద్యార్థులపై లాఠీలు ఝులిపించారు. జల ఫిరంగులు ప్రయోగించారు. దీంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఆగ్రహించిన విద్యార్థులు మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ప్రదర్శన నిర్వహించారు. కళాశాల ఎదుటకు చేరుకుని పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు.మోడీకి ప్రధాని అభినందనలుగుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను బుధవారం ఉదయం కలుసుకున్నారు. ప్రధాని కలుసుకుని బయటకు వచ్చిన తరువాత మోడీ విలేకరులతో మాట్లాడుతూ మూడోసారి గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఎంపికవడంపై ప్రధాని తనను అభినందించారని తెలియజేశారు. అదే విధంగా గుజరాత్‌ అభివృద్ధికి కేంద్రం సహాయం చేస్తోందని హామీ ఇచ్చినట్టు తెలిపారు.