ఢిల్లీ అసెంబ్లీలో జన్‌లోక్‌పాల్ బిల్లు ఆమోదం
– కాలుష్య కోరలు పీకేందుకు కేజ్రీవాల్ సమగ్ర ప్రణాళిక
ఢిల్లీ, డిసెంబర్4(జనంసాక్షి): ఢిల్లీ అసెంబ్లీలో జన్‌లోక్‌పాల్ బిల్లు ఆమోదం పొందింది.ఈ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ అవినీతిని అంతం చేయటం తమ బాధ్యతని స్పష్టం చేశారు. లోక్ పాల్ బిల్లు పై అసెంబ్లీలో చర్చ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే అవినీతిపై ఉక్కుపాదం మోపామని గుర్తుచేశారు. కేజ్రీవాల్ సర్కార్ అధికారంలో లేకపోయినా అవినీతి ఉండవద్దనే ఈ బిల్లు తెచ్చామని చెప్పారు. ఢిల్లీ అసెంబ్లీలో పూర్తి మెజార్టీ ఉండటంతో జన్ లోక్ పాల్ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించారు. ఢిల్లీలో పెరిగిపోతున్న కాలుష్యంపై కేజ్రీవాల్ సర్కార్ చర్యలు చేపట్టింది. ఇకపై ప్రయివేట్ కార్లు ప్రతిరోజూ రోడ్డుపై తిరిగే అవకాశం లేదు. నెంబర్ ప్లేట్ సరి బేసి సంఖ్యల ఆధారంగా రోజు విడిచి రోజు కారును బయటకు తీయాల్సి ఉంటుంది. జనవరి ఫస్ట్ నుంచి ఇది అమలులోకి రానుంది.
ఢిల్లీలో సరి, బేసి నెంబర్ల ఆధారంగా నడవనున్న కార్లు….
ఇకపై రాజధాని నగరం ఢిల్లీలోని రోడ్లపై నెంబర్ల ఆధారంగా కార్లు నడవనున్నాయి. అవి కూడా సరి, బేసి సంఖ్యల ఆధారంగా వాహనాలు రోడ్డుపైకి రానున్నాయి. సరిసంఖ్యలైన 2,4,6,8,0 నెంబర్ కల వాహనాలు మొదటిరోజు…. 1,3,5,7,9 బేసి సంఖ్యల నెంబర్ వాహనాలు రెండోరోజు నడుస్తాయి. సోమవారం కారులో వెళ్తే మంగళవారం కారులో వెళ్లడానికి వీళ్లేదన్నమాట. రోజు తప్పించి రోజు నడపాల్సి ఉంటుంది. అంటే నెలలో కేవలం 15 రోజులు మాత్రమే కారులో వెళ్లే అవకాశముంది. అయితే ఇది ప్రభుత్వ వాహనాలకు వర్తించదు.
జనవరి 1, 2016 నుంచి ఇది అమలులోకి….
ఢిల్లీలో నానాటికి పెరిగిపోతున్న కాలుష్యంపై కేజ్రీవాల్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జనవరి 1, 2016 నుంచి ఇది అమలులోకి రానుంది. ఈ నిర్ణయం వల్ల వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని సగం తగ్గించే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఢిల్లీలో ప్రతిరోజు సుమారు వెయ్యి కార్లు రోడ్డుపైకి వస్తున్నాయి. ఇది ముంబై, కోల్‌కతా, చెన్నై కన్నా ఎక్కువ. ఢిల్లీలో కాలుష్యం తీవ్రస్థాయికి చేరుకోవడంతో గురువారం హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. డిసెంబర్ 21 వరకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించింది.
ఎమర్జెన్సీగా కాబినెట్ సమావేశం నిర్వహించి….
దీంతో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఎమర్జెన్సీగా కాబినెట్ సమావేశం నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఢిల్లీలో వ్యాక్యూమ్ క్లీనర్ ద్వారా రోడ్లపై ధూళిని తొలగించాలని మంత్రిమండలి నిర్ణయించింది. డిటిసి బస్సులు, మెట్రో ట్రెయిన్‌ల సంఖ్యను పెంచడానికి కాబినెట్ ఆమోదం తెలిపింది. కాలుష్యం వెదజల్లుతున్న బదర్‌పూర్ పవర్ ప్లాంట్, ఎన్‌టిపిసికి చెందిన బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్‌ను మూసివేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. అత్యధిక కాలుష్య ప్రాంతంగా ఢిల్లీ బీజింగ్‌ను బీట్ చేసింది.ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సూచిక ప్రకారం ఢిల్లీలో అత్యధిక కాలుష్య ప్రాంతంలో 860 పాయింట్లు నమోదు కాగా…అదే బీజింగ్‌లో 175 మాత్రమే ఉంది. అతి తక్కువ కాలుష్య ప్రాంతం ఢిల్లీలో 260 పాయింట్లు కాగా బీజింగ్‌లో కేవలం 16 పాయింట్లు మాత్రమే నమోదైంది. ఢిల్లీలోని అతితక్కువ పొల్యూషన్ గల ప్రాంతం బీజింగ్‌లోని అత్యధిక కాలుష్య ప్రాంతం కన్నా 50 శాతం ఎక్కువగా ఉండడం గమనార్హం. ఢిల్లీలో కాలుష్యం ఎంత తీవ్రస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.