ఢిల్లీ చర్చలు సానుకూలం

కాంగ్రెస్‌ ఆహ్వానం మేరకే వెళ్లాను
త్వరలో తుది విడత చర్చలు : కేసీఆర్‌
న్యూఢిల్లీ, అక్టోబర్‌ 3 (జనంసాక్షి):
తెలంగాణపై ఢిల్లీస్థాయిలో సానుకూల, ఫలవంతమైన చర్చలు జరిగాయని టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ విషయంలో సానుకూల నిర్ణయం వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. త్వరలో తుదివిడత చర్చలు జరుగుతాయని ఆయన చెప్పారు. పార్లమెంట్‌ సమావేశాలకు హాజరయ్యేందుకు ఢిల్లీకి వచ్చిన కెసిఆర్‌ ఇప్పటివరకు
విూడియాతో మాట్లాడలేదు. ఆయన ఢిల్లీలో ఏ నాయకులను కలిసేది కూడా విూడియాకు తెలియనియ్యలేదు. సుమారు నెలరోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేసిన కెసిఆర్‌ తెలంగాణ కోసం అనేక పార్టీల నాయకులతో భేటీ అయ్యారు. కెసిఆర్‌ ఇక్కడే ఉండటంతో ఆ పార్టీ నాయకులతో పాటు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌, టిడిపి నాయకులు కూడా కెసిఆర్‌ టూర్‌పై దృష్టి పెట్టారు. అంతేకాకుండా ఢిల్లీలో కెసిఆర్‌ ఏం చేస్తున్నారని ప్రశ్నించిన నాయకులు కూడా ఉన్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా కెసిఆర్‌ స్పందించలేదు. బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరుతూ కాసేపు ఆయన విూడియాతో ముచ్చటించారు. కాంగ్రెస్‌ నాయకుల ఆహ్వానం మేరకే ఢిల్లీకి వచ్చానని కెసిఆర్‌ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ నాయకులు కెసిఆర్‌ను ఆహ్వానించలేదని ప్రచారం చేస్తున్న సీమాంధ్ర నాయకులకు కెసిఆర్‌ చెక్‌ పెట్టారు. కేంద్రంలో పలువురు పెద్దలతో తెలంగాణ విషయంపై వివరంగా మాట్లాడానని కెసిఆర్‌ చెప్పారు. విూడియాకు ఒకరిద్దరి నేతలతో భేటీ అయిన విషయాలే తెలుసునని ఆయన చెప్పారు. విూడియాకు తెలియకుండా చాలామంది నాయకులతో సంప్రదింపులు జరిపానని ఆయన చెప్పారు. తన ఢిల్లీ పర్యటన గురించి విూడియాకు తెలిసింది గోరంత, ఢిల్లీలో జరిగింది కొండంత అని కెసిఆర్‌ పేర్కొన్నారు. త్వరలో తెలంగాణపై సానుకూల నిర్ణయం వస్తుందని ఆయన చెప్పారు. తాను సంప్రదింపులు జరిపిన నాయకులంతా తెలంగాణకు అనుకూలంగా ఉన్నారని, అయితే కేంద్రం నిర్ణయం తీసుకుంటే సహకరిస్తామని చెప్పారని కెసిఆర్‌ వెల్లడించారు. యూపీఏ ప్రభుత్వంలో సీనియర్లు కూడా తెలంగాణ విషయంలో స్పష్టమైన వైఖరితో ఉన్నారన్నారు. యూపీఏ పెద్దలతో చర్చల గురించి విూడియా ప్రశ్నించగా కెసిఆర్‌ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. త్వరలో తుది
విడత చర్చలు ఉంటాయని, అప్పుడు తెలంగాణపై సానుకూలంగా నిర్ణయం వెలువడుతుందని ఆయన చెప్పారు. కెసిఆర్‌ కాంగ్రెస్‌ పెద్దలతో సమావేశమయ్యానని, తెలంగాణపై చర్చించానని చెబుతుంటే సీమాంధ్ర కాంగ్రెస్‌ సీనియర్లు మాత్రం అటువంటిదేవిూ లేదని అంటున్నారు. మంత్రి టిజి వెంకటేష్‌ బుధవారం ఢిల్లీలో మాట్లాడుతూ కెసిఆర్‌ ఢిల్లీ టూర్‌ వల్ల ప్రయోజనమేవిూ లేదన్నారు. ఇప్పట్లో తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకోదని, 2014 ఎన్నికలకు ఆరు నెలల ముందు నిర్ణయం ప్రకటిస్తుందని చెప్పారు. విజయవాడ ఎంపీ లగడపాటి రెండు రోజుల క్రితం మాట్లాడుతూ కెసిఆర్‌ను చర్చల కోసం ఎవరూ ఆహ్వానించలేదని, ఢిల్లీలో తెలంగాణపై ఎటువంటి చర్చలు జరగటం లేదని చెప్పారు. కెసిఆర్‌ మాటలకు సీమాంధ్ర నేతల ప్రకటనలకు పొంతన లేకపోవడంతో అసలు ఢిల్లీలో కెసిఆర్‌ ఏం చేశారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. గత వారం సీఎం కిరణ్‌ విూడియాతో మాట్లాడుతూ కెసిఆర్‌ ఢిల్లీ టూర్‌పై స్పందించారు. ఢిల్లీలో ఎంతోకొంత తెలంగాణ విషయంలో చర్చ జరుగుతుందని, అందుకనే కెసిఆర్‌ అక్కడ ఉన్నారని ఆయన చెప్పారు. కెసిఆర్‌ చెప్పిన విషయాలు కూడా సీఎం వ్యాఖ్యలకు దగ్గరగా ఉండటంతో కెసిఆర్‌ కాంగ్రెస్‌ పెద్దలతో సమావేశమైన విషయం సీఎం కిరణ్‌కు కూడా తెలిసి ఉండొచ్చని విశ్లేషకుల అభిప్రాయం. కెసిఆర్‌ కూడా ఢిల్లీలో ఎవరిని కలిసింది, సంప్రదింపుల సారాంశం వెల్లడించలేదు. ఒకటి, రెండు రోజుల్లో విూడియా సమావేశం ఏర్పాటు చేసి ఢిల్లీ టూర్‌ వివరాలను కెసిఆర్‌ వెల్లడించే అవకాశం ఉంది.