ఢిల్లీ సీబీఐ కార్యాలయంలో ఛోటా రాజన్‌

1
– వైద్య పరీక్షలు నిర్వహించిన ఏయిమ్స్‌ వైద్యులు

న్యూఢిల్లీ,నవంబర్‌6(జనంసాక్షి):

అండర్‌వరల్డ్‌ డాన్‌ చోటారాజన్‌ను సీబీఐ అధికారులు భారత్‌కు తీసుకువచ్చారు. ఇండోనేషియాలోని బాలిలో ఛోటారాజన్‌ను అరెస్ట్‌ చేసిన అధికారుల బృందం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకువచ్చారు. ఛోటారాజన్‌ను అధికారులు సీబీఐ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో సీబీఐ ప్రధాన కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అండర్‌వరల్డ్‌ డాన్‌ చోటా రాజన్‌ 27 సంవత్సరాల తర్వాత భారత్‌లోకి శుక్రవారం ఉదయం అడుగుపెట్టారు. శుక్రవారం ఉదయం 5 గంటలకు రాజన్‌ ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అనంతరం అక్కడి నుంచి రాజన్‌ను సీబీఐ ప్రధాన కార్యాలయానికి తరలించారు. రాజన్‌కు ఎయిమ్స్‌ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. మూత్రపిండాల సంబంధిత వ్యాధితో రాజన్‌ బాధ పడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. రాజన్‌ను రా, ఐబీ అధికారులు ప్రశ్నించనున్నారు. చోటారాజన్‌పై నమోదైన కేసులన్నింటినీ మహారాష్ట్ర ప్రభుత్వం  సీబీఐకి బదిలీ చేసింది. రాజన్‌ భారత్‌ బయల్దేరడంతో చీఫ్‌ సెక్రటరీ కేపీ బక్షి హుటాహుటిన విూడియా సమావేశం ఏర్పాటు చేసిన అతనిపై ఉన్న కేసులను సీబీఐకి అప్పగిస్తున్నట్టు తెలిపారు. రాజన్‌కు సంబంధించిన కేసులను సీబీఐ విచారిస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎస్‌ తెలిపారు.  ముంబై, ఢిల్లీతోపాటు యూపీ పోలీసులు విచారిస్తారు. ఇటీవల ముగ్గురు క్రిమినల్స్‌ను అరెస్ట్‌ చేసిన యూపీ పోలీసులు, చోటారాజన్‌ గ్యాంగ్‌తో వారికున్న సంబంధాలపై ఆరా తీయనున్నట్టు ఎస్టీఎఫ్‌ ఐజీ సుజిత్‌పాండే తెలిపారు. బాలిలో అరెస్టయిన చోటారాజన్‌ పాస్‌పోర్ట్‌ను భారత విదేశాంగశాఖ రద్దు చేసింది. నకిలీపత్రాలతో పాస్‌పోర్ట్‌ సంపాదించి ఆస్ట్రేలియా పారిపోయినట్టు విదేశాంగశాఖ అధికారప్రతినిధి వికాస్‌స్వరూప్‌ తెలిపారు. దీనిపై భారత ప్రభుత్వం విచారణ కమిటీని నియమించిందని తెలిపారు. ఇలా జరగడం ఇది తొలిసారి కాదని, ఇదే చివరిది కూడా కాదని, ఇలాంటివి తమ దృష్టికి వస్తే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.