తక్కువస్థానాల్లో పోటీ వ్యూహంలో భాగమే..
` మేమంతా మోదీ సిద్ధాంతాలకు వ్యతిరేకం
` దేశంలో నిరంకుశ పాలన!
` దేశంలో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ అణిచివేస్తోంది
` రాహుల్, ప్రియాంకలే మా ఆస్తులు:ఖర్గే
న్యూఢల్లీి(జనంసాక్షి):ఇండియా కూటమిని కలిసికట్టుగా ఉంచి, బీజేపీని ఓడిరచే వ్యూహంలో భాగంగానే ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తక్కువ సీట్లలో పోటీ చేసిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. పలు ప్రాంతాల్లో బలంగా ఉన్న ఇతర పార్టీలకు సీట్లు కేటాయించామని పేర్కొన్నారు. అలాగే కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీని పార్టీ ఆస్తిగా అభివర్ణించారు. ప్రముఖ వార్తా సంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖర్గే పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.’’ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీ ఆస్తి. అలాగే స్టార్ క్యాంపెయినర్ కూడా. ఆమె ఈ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదనే ప్రియాంక గాంధీ నిర్ణయాన్ని సమర్థిస్తున్నా. సోనియా గాంధీ 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలో ఆమెకు బాగా తెలుసు. సోనియా గాంధీకి ఆరోగ్యం బాగా లేదు. ప్రియాంక గాంధీ, రాహుల్ మా పార్టీ ఆస్తులు, స్టార్ క్యాంపెయినర్లు. వారి ప్రసంగాలు వినడానికి వేలాది మంది ప్రజలు వస్తారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో తక్కువ సీట్లలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలను కలిసికట్టుగా ఉంచడానికే తక్కువ సీట్లలో పోటీ చేస్తున్నాం. అందుకే మేము రాజీ పడ్డాం. భావ సారూప్యత గల పార్టీలతో సంప్రదింపులు జరిపిన తర్వాత ప్రతి రాష్ట్రంలోనూ పొత్తులను పెట్టుకునేందుకు కాంగ్రెస్ కమిటీని ఏర్పాటు చేసింది. కేరళ, బంగాల్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో ఇండియా కూటమి పార్టీల మధ్య పోటీ నెలకొంది. అయితే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రతి రాష్ట్రానికి భిన్నమైన కూటమి ఉంటుంది. అయితే మేమంతా బీజేపీ, మోదీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. దేశ ప్రయోజనాల కోసమే కూటమిగా ఏర్పడ్డాం. వయనాడ్, రాయ్ బరేలి రెండిరటిలోనూ గెలిస్తే రాహుల్ ఏ సీటును నిలబెట్టుకుంటారో ఆయన వ్యక్తిగత నిర్ణయం’’ అని ఖర్గే వ్యాఖ్యానించారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి రాకుండా ఇండియా కూటమి ఆపగలదని మల్లికార్జున ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. ఇండియా కూటమి ఈ ఎన్నికల్లో మెజారిటీ మార్క్ ను అందుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.‘‘కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే చట్టాలన్నింటినీ సవిూక్షిస్తాం. ప్రజలను ఇబ్బంది పెట్టే ఏ చట్టాన్నైనా వ్యతిరేకిస్తాం. బీజేపీలా దర్యాప్తు సంస్థలను ఇప్పటివరకు ఏ పార్టీ దుర్వినియోగం చేయలేదు. దర్యాప్తు సంస్థలు సోదాలు జరపడం తప్పు కాదు. కేసులపై సరైన విచారణ జరపాలి. కానీ బీజేపీ తప్పుడు కేసులు సృష్టించి ప్రజలను కటకటాలపాలజేస్తోంది. ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతలను బీజేపీ ఎందుకు జైలుకు పంపిస్తోంది. గత పదేళ్లుగా అధికారంలో ఉన్నా అప్పుడు ఎందుకు విపక్ష నేతలను అరెస్టు చేయలేదు? ఎన్నికలప్పుడే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ప్రతిపక్ష నేతలపై బెదిరింపులు, వేధింపులకు దిగుతున్నారు. ప్రచారానికి కూడా వారిని వదిలిపెట్టలేదు. ప్రజాస్వామ్యానికి ఇలాంటివి మంచిది కాదు. దేశంలో నిరంకుశ పాలన అమలవుతోంది’’ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తోందని, అలాగే రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తోందని మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయడానికి సీనియర్ నాయకులు అవసరమని, అందుకే కొందరిని ఎన్నికల బరిలో నిలపలేదని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పోటీ చేసే స్థానాలను గెలిపించుకునేందుకు శ్రమిస్తున్నామని తెలిపారు.