తక్షణం తప్పించండి
– అరుణ్ జైట్లీపై కేజ్రీవాల్ ఫైర్
న్యూఢిల్లీ,డిసెంబర్17(జనంసాక్షి): కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని మంత్రి పదవి నుంచి తక్షణమే తప్పించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై ఆప్ విమర్శల పరంపర కొనసాగుతోన్న విషయం తెలిసిందే. దిల్లీ అండ్ డిస్టిక్ట్ర్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ)కి గతంలో జైట్లీ అధ్యక్షుడిగా వ్యవహరించిన సమయంలో పలు అవకతవకలు చోటుచేసుకున్నాయని ఇందుకు బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చెయ్యాలని ఆప్ డిమాండ్ చేసింది. ఈ విషయమై పలువురు ఆప్ నాయకులు గురువారం దిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికే డిప్యూటి సిఎం సిసోడియా సిబిఐ దాడులపై విమర్శలు చేశారు. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్(ఎస్‌ఎఫ్‌ఐఓ), డీడీసీఏ అంతర్గత విచారణ కమిటీలు ఇచ్చిన నివేదికల్లో ఈ విషయం స్పష్టమయిందని వారు చెప్పారు. డీడీసీఏలో పెద్దఎత్తున జరిగిన అవినీతిలో జైట్లీకి పరోక్షంగా, ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జైట్లీని రాజీనామా చెయ్యాల్సిందిగా కోరాలని ఆప్ అధికార విూడియా ప్రతినిధి రాఘవ్ చద్దా డిమాండ్ చేశారు.