తగ్గని ఎండల ప్రభావం

రుతుపవనాల కోసం అన్నదాతల ఎదురుచూపు

ఖరీఫ్‌కు అధికారుల సన్నద్దత

అమరావతి,జూన్‌2(జ‌నం సాక్షి): రుతుపవనాలు కేరళను తాకినా ఎపిలోకి అడుగు పెట్టడానికి మరో ఐదు రోజులు ఆగాల్సిందే. రాష్ట్రవ్యాప్తంగా సగటున 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయన్నారు. వాతావరణంలో తేమ శాతం తక్కువగా ఉండటంతో తీవ్రమైన వేడి 23 మండలాలు, వేడి 66 మండలాల్లో ఉంది. మరో 319 మండలాల్లో ఉక్కపోతలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నెల మొదటి వారంలో రుతుపవనాలు చేరే అవకాశం ఉందని సమాచారం ఇచ్చింది. నైరుతి రుతుపవనాలు ఇప్పటికే కేరళను తాకాయి. రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతంలోకి తొలుత ప్రవేశిస్తాయి. అవి కోస్తాకు చేరేందుకు మరో రెండు రోజుల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో వేడిగాలులు, ఉక్కపోతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇదిలావుంటే తొలకరి వస్తే తప్ప రైతులు తమ వ్యవసాయ పనులు చేపట్టలేరు. మరోవైపు వ్యవసాయ శాఖ ఈ సీజన్‌లో ముందస్తు ఖరీఫ్‌కు సిద్ధమవుతోంది. జూన్‌ మొదటి వారంలో మంచి వర్షాలు పడతాయన్న వాతావరణ విభాగం అధికారుల అంచనాలతో వేగం పెంచారు. ఇప్పటికే అధికారులు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని రైతాంగాన్ని సన్నద్ధం చేసింది. వారిలో ఈ మేరకు అవగాహన కల్పించారు. అన్నదాతలు అదనపు ఆదాయం పొందేలా ప్రోత్సహిస్తున్నారు. స్వల్పకాలంలో దిగుబడి చేతికి వచ్చే మినుము, పెసర విత్తనాలను కూడా రాయితీపై అందించనున్నారు. దీనిపై రైతుల్లో సానుకూలత వ్యక్తమవుతోంది. గత రబీలో వేసిన పంటలు చీడపీడలకు దెబ్బతినడంంతో దిగుబడి చేతికి అందలేదు. దీంతో ఈ సారి రెట్టింపు విస్తీర్ణంలో పంట వేయనున్నారు.మెట్ట ప్రాంతాల్లో సాగర్‌ కాలువల పరిధిలో ముందుగా పంటలు వేసుకునేందుకు ఇప్పటికే విత్తనాలను ఆయా మండలాలకు పంపించారు. నాగార్జున సాగర్‌ ఎడమ కాలువ కింద కృష్ణా జిల్లాలోని పశ్చిమ ప్రాంతం, కుడి కాలువ పరిధిలోని గుంటూరు లోని పల్నాడు ప్రాంతం ఆయకట్టు ఉంది. రాష్ట్ర విభజన తర్వాత సాగర్‌కు నీటిని సరిగా విడుదల చేయక పోవడంతో రెండు జిల్లాల్లోని మొట్ట ప్రాంత రైతులకు సాగునీటిపై భరోసా కొరవడింది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాల్లోని రైతులకు వర్షాధారంగా ముందస్తు ఖరీఫ్‌ సాగు చేయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వర్షాధార ప్రాంతాల్లో తొలకరి జల్లులకు అపరాలు సాగు చేస్తే తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం పొందే అవకాశం ఉంది. గత ఏడాది గుంటూరు జిల్లాలో చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమైంది. దీంతో ముందస్తు ఖరీఫ్‌ను ఈ దఫా అధిక విస్తీర్ణంలో వేసేలా అధికారులు ప్రణాళిక రచించారు. గత ఏడాది ఆలస్యంగా పంటలు సాగుచేయడంతో నీరు అందక రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.