తనపై కాంగ్రెస్ చేసిన ఆరోపణపై విచారణ చేపట్టాలే
మంథని, (జనంసాక్షి) : అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిన క్రమంలో నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని బీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ, జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ భరోసా ఇచ్చారు.
బుధవారం మంథనికి వచ్చిన ఆయన మంథనిలోని మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం రాజగృహాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భూపాలపల్లి జెడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణీ రాకేష్‌తో కలిసి ఆయన మాట్లాడారు. స్వాతంత్య్ర చరిత్రలో ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన తనకు నాలుగేండ్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే అభివృధ్ది చేశానని, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అగ్రవర్ణాల్లోని ఆలోచనపరుల ఆశీర్వాదంతో నాలుగేండ్లు ఎమ్మెల్యేగా పని చేశానని, ఎమ్మెల్యే అంటే ప్రజలకు సేవకుడనే అర్థం చాటి చెప్పానన్నారు.అలాగే ఈ తొమ్మిదేండ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అనేక అబివృద్ది చేసి చూపించానన్నారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం పరామర్శలు, అంతిమ యాత్రల్లో పాడెలు మోసే సంస్కృతిని తీసుకువచ్చానని అన్నారు. అయితే నాటి నుంచి నేటి వరకు ఎన్నికల సమయంలో తనపై కాంగ్రెస పార్టీ నాయకులు ఆనేక ఆరోపణలు చేశారని, గత ఎన్నికల్లో రూ.900 కోట్లు సంపాదించుకున్నానని, ఈనాడు రౌడీగా గుండాగా చిత్రీకరించారని అన్నారు. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన క్రమంలో తనపై చేసిన ఆరోపణలపై సమగ్ర విచారణచేసి ప్రజల ముందు ఉంచాలని, అలాగే రూ. 900కోట్లు వెలికితీసి ప్రజలకు పంచిపెట్టాలని ఆయన డిమాండ్‌చేశారు. డబ్బులు బయటకు తీయని పక్షంలో ప్రజలకు జవాబు చెప్పాలన్నారు. ఈనాడు నియోజకవర్గంలోని అనేక సమస్యలను ప్రజలకు చూపించారని, భూసేకరణ, సింగరేణి ప్రభావిత గ్రామ ప్రజల సమస్యలు, కాళేశ్వరం ప్రాజెక్టు సమస్యలను ప్రజల ముందు ఉంచారని, లద్నాపూర్ గ్రామంలో ఆర్‌అండ్ఆర్ ప్యాకేజీ ఇప్పించడం లాంటి ప్రజలకు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అంతే కాకుండా ఇసుక లారీలు తనవేనని ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నాయకులు లారీలను ఆపుతారో లేక తనవని చూపిస్తరో చెప్పాలన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హమీని కాంగ్రెస్ అమలు చేయాలని, పథకాల కోసం ప్రజలు ఎదురు చూస్తన్నారని ఆయన అన్నారు. తాము ఆశించిన విధంగా ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేయాలని ఆయన అన్నారు. తాను జెడ్పీ చైర్మన్ పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉంటే పార్టీ అధ్యక్షులు కేసీఆర్ ఆ ఆలోచన విరమించుకోవాలని కోరారని, అదే విధంగా నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తల విజ్ఞప్తి మేరకు విరమించుకోవడం జరిగిందని, నియోజకవర్గంలో పార్టీ బలోపేతంతో పాటు ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తానని అన్నారు. ఓటమికి గురయ్యామని అధైర్యపడవద్దని దైర్యంగా ఉండాలని 24 గంటలు రాజగృహ ఉంటుందనే విషయాన్ని మర్చి పోవద్దన్నారు. రాజ్యాంగ స్పూర్తితో ఓటు విలువ తెలుపేందుకు కృషి చేస్తానని, మహనీయుల స్పూర్తి ఆలోచన విధానాలతో ముందుకు వెళ్తానన్నారు. బహుజనుల రాజ్యాధికారం కోసం పాటుపడుతానని, అదే తన ఏజెండానని ఆయన ఈ సందర్బంగా స్పష్టం చేశారు