‘తప్పుడు కేసుతో జీవితం నాశనమయ్యింది’

హైదరాబాద్: పోలీసుల నిర్వాకం కారణంగా తన జీవితం నాశనమయ్యిందిని కూకట్‌పల్లి హైదర్‌నగర్‌కు చెందిన ఓ అధ్యాపకుడు ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎలాంటి తప్పు చేయకపోయినా షీ టీమ్ పోలీసులు అనవసరంగా కేసులో ఇరికించారని ఆరోపించారు. బుధవారం బాధితుడు మల్గీ ధన్‌శెట్టి  తన భార్య పరమేశ్వరి, తల్లి కళావతితో కలిసి బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు.

వివరాల్లోకి వెళితే కూకట్‌పల్లి హైదర్‌నగర్‌కు చెందిన మల్గీ ధన్‌శెట్టి కొన్నేళ్లుగా నగరంలోని పలు ప్రముఖ కళాశాల్లో కళాశాలలో కెమిస్ట్రీ అధ్యాపకునిగా పనిచేశారు. గత జనవరి 12వ తేదీన నాంపల్లి నుంచి కూకట్‌పల్లి వెళ్లేందుకు బైక్‌పై వెళుతుండగా ఫోన్ రావడంతో లక్డీకపూల్ బస్టాప్ సమీపంలో బైక్ ఆపి సెల్‌లో మాట్లాడుతుండగా, అక్కడే ఉన్న ఓ మహిళ ( మఫ్టీలో ఉన్న మహిళా కానిస్టేబుల్ ) తనను లిఫ్ట్ అడిగినట్లు తెలిపారు.

ఫోన్‌లో మాట్లాడడం పూర్తయిన తర్వాత ఆమె వద్దకు వెళ్లి అమ్మా లిఫ్ట్ అడిగారు కదా వస్తారా అని కోరినట్లు తెలిపారు. దీంతో అదే సమయంలో వచ్చిన మరో కానిస్టేబుల్ వచ్చి మహిళలను టీజ్ చేస్తున్నారని ఆరోపిస్తూ సీసీఎస్‌కు తీసుకెళ్లినట్లు తెలిపారు. అయితే పోలీసులకు తాను అలాంటి వాడిని కాదనీ, ఉన్నతాధికారులకు తన   వ్యక్తిగత వివరాలు అందించడంతో అప్పటికి వదిలేశారన్నారు.

వారం రోజుల తర్వాత సీసీఎస్ పోలీసులు మళ్లీ కాల్ చేసి పీఎస్‌కు రావాలని చెప్పారన్నారు. స్టేషన్‌కు వెల్లిన తనను నాంపల్లి మెట్రోపాలిటన్ కోర్టులో హాజరపరిచినట్లు తెలిపారు. అంతేగాకుండా  నేరం ఒప్పుకుని ఫైన్ చెల్లిస్తే కేసు నుంచి బయటపడతావని లేకుంటే శిక్ష పడుతుందని బెదిరించారని తెలిపారు. మెట్రోపాలిటన్ కోర్టు తీర్పుపై సెషన్ కోర్టును ఆశ్రయించగా, కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ తాను చెల్లించిన ఫైన్‌ను రీఫండ్ చేయాలని తీర్పు ఇచ్చిందన్నారు. అయితే కొందరు పోలీసుల వైఖరి కారణంగా తన అధ్యాపక జీవితం పూర్తిగా నాశనమయ్యిందన్నారు.