తమిళనాడులో దూసుకుపోతున్న డీఎంకే కూటమి
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి 293 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, ఇండియా బ్లాక్ 214 సీట్లలో, ఇతరులు 29 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఇక తమిళనాడులో వార్ వన్‌సైడ్ అన్నట్లుగా సాగుతున్నది. రాష్ట్రంలోని మొత్తం 39 స్థానాల్లో డీఎంకే కూటమి 33 స్థానాల్లో లీడ్‌లో ఉన్నది. బీజేపీ, అన్నాడీఎంకే, ఇతరులు ఒక్కో స్థానం చొప్పున మెజార్టీలో కొనసాగుతున్నారు. సీఎం స్టాలిన్ సోదరి కనిమోలి తూత్తికూడిలో ఆధిక్యంలో ఉండగా, టీఆర్ బాలు (శ్రీపెరంబుదుర్), దయానిధి మారన్ (సెంట్రల్ చెన్నై), కార్తి చిదంబరం (శివగంగ) లీడ్‌లో కొనసాగుతున్నారు.ఇక తమిళనాడులో ఈసారి మెజార్టీ సీట్లు సాధించాలనుకున్న బీజేపీకి ఈసారి కూడా తీవ్ర నిరాశే ఎదురయింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామళై, (కోయంబత్తూరు), తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ కూడా పోటీలో వెనుకబడిపోయారు.ఇక కర్ణాటకలో అధికార కాంగ్రెస్ పార్టీకి భంగపాటు ఎదురయింది. రాష్ట్రంలో మరోసారి తనకు తిరుగులేదని బీజేపీ నిరూపించుకున్నది. ఇప్పటివరకు రాష్ట్రంలోని మొత్తం 28 స్థానాల్లో బీజేపీ 20 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతుండగా, కాంగ్రెస్ 8 స్థానాలకే పరిమితమైంది.