తలకిందులు తపస్సు చేసినా కాంగ్రెస్‌ గెలవదు

వారు అధికారంలోకి రావడం కల్ల
కాంగ్రెస్‌ నేతలు రక్తం మరిగిన పులి
పదవులకు రాజీనామా చేయకుండా పట్టుకు వేలాడారు
అరుణ అరాచకాలు ఎవరిని అడిగినా చెబుతారు
మండిపడ్డ మంత్రి జూపల్లి కృష్ణారావు
హైదరాబాద్‌,అక్టోబర్‌13(జ‌నంసాక్షి):  రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తలకిందులుగా తపస్సు చేసినా అధికారంలోకి రావడం కష్టమని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. వారు కూటమి కట్టినా,మరేది చేసినా భంగపాటు తప్ప మరోటి సాధ్యం కాదన్నారు. టీఆర్‌ఎస్‌ఎల్పీలో జూపల్లి కృష్ణారావు విూడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ లీడర్లు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా ఆ పార్టీ అధికారంలోకి రావడం కలనే అని అన్నారు. తాను కాంగ్రెస్‌ నేతల్లాగా.. ప్రజల రక్తమాంసాలు తినే పులిని కాదని స్పష్టం చేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని.. వందలాది మండి పోలీసులను పెట్టినా గద్వాల పాదయాత్ర చేసి అరుణ బండారం బయటపెట్టాను అని గుర్తు చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ప్రాజెక్టులు మా పుణ్యమే అని డీకే అరుణ అంటున్నారు. మరి విూ పుణ్యమైతే అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రాజెక్టులు మొదలు కావడానికి, పూర్తి కావడానికి గులాబీ జెండానే కారణమని తేల్చిచెప్పారు. 2001లో గులాబీ జెండానే పుట్టకపోయి ఉంటే.. తెలంగాణకు మరింత అన్యాయం జరిగే ఉందేదన్నారు. కాంగ్రెస్‌కు ఓటెందుకు వేయాలని జూపల్లి ప్రశ్నించారు. నాడు తెలంగాణ ఉద్యమంలో కలిసిరాకుండా.. పదవుల కోసం పాకులాడినందుకు వేయాలా? 24 గంటలు కరెంట్‌ ఇవ్వనందుకా? సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకుంటున్నందుకా? అని నిలదీశారు. కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలే బుద్ది చెబుతారని తెలిపారు. ప్రజలకు వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్‌ పార్టీని 2014లో ఓడించారు. ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ పార్టీ ఓటమి ఖాయమని జూపల్లి స్పష్టం చేశారు.  కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీకే అరుణపై  జూపల్లి కృష్ణా రావు మండిపడ్డారు. ‘కాంగ్రెస్‌ పార్టీ నాకు రాజకీయ భిక్ష పెట్టలేదు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో మూడు రోజులు
పర్యటించిన కాంగ్రెస్‌ నేతలు అసత్య ఆరోపణలు చేశారు. తెలంగాణ ఇచ్చామని చెప్పి కూడా 2014లో కాంగ్రెస్‌ నేతలు మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఎందుకు ఓడిపోయారు. నేను ఎక్కడ ఉన్నా గెలిచాను. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణకు చేస్తున్న ద్రోహంతోనే అప్పట్లో పార్టీ వీడి టీఆర్‌ఎస్‌లో చేరాను. మహబూబ్‌నగర్‌ అభివృద్ధి తెలంగాణ ఉద్యమ గొప్పతనమే. డీకే అరుణకు రాజకీయ భిక్ష పెట్టిందే నేను. నేను అవినీతి పరుడినని అరుణ సిగ్గూ శరం లేకుండా మాట్లాడుతున్నార’ ని వ్యాఖ్యానించారు.  నాలుగు జన్మలెత్తినా నాపై అరుణ వేలెత్తి చూపలేరు. అరుణ భర్త భరసింహారెడ్డిపై కేసులు లేవా?. దొంగ తెలివి తేటలు అరుణ కుటుంబానికే ఉన్నాయి. నేను బ్యాంకు నుంచి నిబంధనల ప్రకారం అప్పు తీసుకున్నా..మళ్లీ కట్టేశా. నేను పులిని కాదు పిల్లి అన్నారు..అవును డీకే అరుణ కుటుంబం లాగా రక్త మాంసాల రుచి చూసే పులిని మాత్రం కాదు. సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు 3 గంటల్లో రాజీనామా చేస్తే డీకే అరుణ లాంటి తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు మూడేళ్లయినా రాజీనామా చేయలేదు. అధికారంలోకి రావడానికి కాంగ్రెస్‌ నేతలు మాయమాటలు చెబుతున్నారు. యువత విూద కాంగ్రెస్‌ నేతలకు ఎక్కడ లేని ప్రేమ వస్తోంది. ఎవరూ కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితి లేదు. డీకే అరుణది ఆత్మవంచన..సిగ్గు తప్పిన బతుకు’ అని ఘాటు విమర్శలు చేశారు. ఈ సారి ఆమె కూడా టిఆర్‌ఎస్‌ ప్రభంజనంలో కొట్టుకుపోక తప్పదన్నారు. ‘ స్వయం కృషితో క్లర్క్‌ స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగా..ఈ ఎన్నికల్లో కొల్లాపూర్‌ నుంచి గెలుస్తా. గద్వాలలో ఏ చెట్టూ, పుట్టనడిగినా డీకే అరుణ కుటుంబం అక్రమ దందాల గురించి చెబుతాయి. కేసీఆర్‌ను దించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌, టీడీపీలు పొత్తు పెట్టుకుంటున్నాయి. మహబూబ్‌ నగర్‌ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తున్న చంద్రబాబుతో పొత్తును జిల్లా నేతలు వ్యతిరేకించకుండా సమర్ధించడం సిగ్గు చేటు. ఈ కాంగ్రెస్‌కు 20 కాదు కదా రెండు సీట్లు కూడా గెలవదు. కాంగ్రెస్‌కు తెలంగాణ ప్రజలు గోరీ కట్టారు. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ సాధించిన ఫలితాలే ఈ ఎన్నికల్లో కూడా పునరావృతం అవుతాయి. కాంగ్రెస్‌కు బలం ఉంటే టీడీపీతో పొత్తు ఎందుక’ని సూటిగా ప్రశ్నించారు.