తాజ్‌మహల్‌ వద్ద నమాజ్‌ వద్దు

అభ్యర్థనను తోసిపుచ్చిన సుప్రీం
న్యూఢిల్లీ, జులై9(జ‌నం సాక్షి) : ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తాజ్‌మహల్‌ వద్ద నమాజ్‌ చేయవద్దు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తాజ్‌మహల్‌ వద్ద నమాజ్‌ చేసుకునేందకు అవకాశం ఇవ్వాలంటూ పెట్టుకున్న అభ్యర్థనను సుప్రీం సోమవారం తోసిపుచ్చింది. చరిత్రాత్మక కట్టడం తాజ్‌మహల్‌ ప్రపంచంలోని ఏడవ వింత అని, అక్కడ ఎలాంటి ప్రార్థనలు చేయడం సరైంది కాదు అని సుప్రీం పేర్కొన్నది. వీలు ఉండే ఇతర ప్రాంతాల్లో నమాజ్‌ చేసుకోవచ్చు అని కోర్టు తెలిపింది. కేవలం ఆగ్రాలో నివసిస్తున్న ముస్లింలు మాత్రమే తాజ్‌ వద్ద శుక్రవారం రోజున నమాజ్‌ చేసుకునేందుకు వీలు కల్పిస్తూ జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. దీన్ని సవాల్‌ చేస్తూ కొందరు సుప్రీంను ఆశ్రయించారు. అయితే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తాజ్‌ వద్దకు విదేశీ టూరిస్టులు కూడా వస్తుంటారని, భద్రత దృష్ట్యా నమాజ్‌ చేసుకోవడాన్ని నిలిపివేయాలని కోర్టు తెలిపింది. ప్రతి శుక్రవారం టూరిస్టులకు తాజ్‌మహల్‌ను మూసివేస్తారు. ఆ రోజున స్థానిక ముస్లింలు నమాజ్‌ చేస్తారు. అయితే ఇటీవల బంగ్లాదేశ్‌తో పాటు ఇతర దేశాల ముస్లిం అక్కడకు వచ్చి నమాజ్‌ చేయడాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు.