తీవ్రమవుతున్న ట్రాఫిక్ సమస్య
దుకాణాలుగా మారుతున్న సెల్లార్లు
సిద్దిపేట,మే16(జనం సాక్షి): సిద్దిపేట జిల్లా కేంద్రంగా మారడంతో రాకపోకల తాకిడి పెరిగి ట్రాపిక్ చిక్కులు ఏర్పడుతున్నాయి. పట్టణ ప్రణాళిక విభాగం అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడటంతో అక్రమ సెల్లార్లు నిర్మితమవుతున్నాయి. పట్టణంలోని ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునికీకరణ పక్రియ నిధానంగా సాగుతోంది. ప్రతిష్టాత్మకమైన విధానంలో ఇక్కడి పక్రియ రాష్ట్రస్థాయిలోనే ఆదర్శంగా ఉండాలనే నిర్ణయించారు. హైదరాబాద్ రోడ్డులో చాలాచోట్ల ఆటో, ద్విచక్ర వాహనాల మరమ్మతు దుకాణాల వద్ద రద్దీ పెరుగుతోంది. పాతబస్టాండ్ నుంచి మెదక్ మార్గంలో ప్రధాన రహదారికి ఇరువైపులా అరకిలోవిూటరు మేర రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది.ముఖ్యంగా ప్రధాన రహదారులపై ఉన్న సెల్లార్లను కొందరు దుకాణాలుగా మార్చేసి విక్రయిస్తున్నారు. అటు హైదరాబాద్, మెదక్, కరీంనగర్ మార్గాల్లో అనుమతిలేకుండా దుకాణాలు నిర్మించి వ్యాపారాలు సాగిస్తున్నారు. తొలుత సెల్లార్‌లుగా నిర్మిస్తున్నా కొంతకాలం తర్వాత వాటిని వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారు. ఈవిషయంగా అధికారులు మిన్నకుండిపోతున్నారు. . వ్యాపార కేంద్రంగా గుర్తింపు పొందిన పట్టణంలో అన్నివర్గాల వారికి ట్రాఫిక్ తిప్పలు తప్పడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారాలు.. అడ్డగోలుగా అక్రమ కట్టడాలు.. ఇరుకు రహదారుల కారణంగా జిల్లా కేంద్రమైన సిద్దిపేటలో ట్రాఫిక్ సమస్య వేధిస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న పార్కింగ్ సమస్యతో పాదచారులు, వినియోగదారులు, వాహన చోదకులు అగచాట్లు పడుతున్నారు. నిత్యం వేలాది మంది వివిధ పనుల నిమిత్తం సిద్దిపేటకు వస్తున్నారు. వాణిజ్య, వ్యాపార పనుల కోసం వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. ఆ స్థాయిలో పార్కింగ్ సదుపాయం ఉండటంలేదు. పరిమితికి మించిన వాహనాలతో రోడ్లు కిటకిట లాడుతున్నా చర్యలు తీసుకునేవారు కరవవుతున్నారు. దళారుల ప్రమేయంతో కొందరు అధికారులు మామూళ్లు పుచ్చుకుంటూ అక్రమాలను ప్రోత్సహించారనే విమర్శలున్నాయి. రోడ్లపైనే వాహనాల్ని నిలిపినా తగిన చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. అప్పుడప్పుడు ప్రధాన మార్గాల్లో నిలిపిన వాహనాల్ని పోలీసులు తీసుకెళ్తున్నా.. ఈ సమస్యకు పరిష్కారం లభించడంలేదు. పైగా ఇది వారికి తలనొప్పి వ్యవహారంగా మారింది. దీంతో దుకాణదారులు, వాహనదారులకు స్థలం విషయంలో నిత్యం ఏదో ఒక చోట గొడవలు జరుగుతూనే ఉన్నాయి.
——————-