తుదిశ్వాస వరకూ జనలోక్‌పాల్‌ కోసం పోరాడుతా

మా పోరాట ఫలితమే స.హ. చట్టం
గ్రామస్థాయినుంచే అవినీతి వ్యతిరేక పోరాటం
జన్‌లోక్‌పాల్‌తో 50శాతం అవినీతిని అరికట్టొచ్చు
అన్నాహజారే
హైదరాబాద్‌, ఫిబ్రవరి 17 (జనంసాక్షి) :
తుది శ్వాస వరకూ జన్‌లోక్‌పాల్‌ కోసం పోరాడు తూనే ఉంటానని సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే స్పష్టం చేశారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని వెస్లీ కళాశాల మైదానంలో జనతంత్రమోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన బహి రంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామ స్థాయి నుంచి అవినీతి వ్యతిరేక పోరాటం సాగి స్తామని తెలిపారు. ఇప్పటికే ఈ ఉద్యమాన్ని గ్రామ సీమల్లోకి తీసుకెళ్లామని, మరింత బలంగా ఉద్య మాన్ని నిర్మిస్తామని తెలిపారు. కోటీశ్వరులు కూడా పొందలేని ఆనందాన్ని ప్రజాసేవలో పొందు తున్నానని తెలిపారు. తన జీవితాన్ని దేశ సేవకే అంకితం చేశానని, రెండున్నర దశాబ్దాల క్రితమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆరున్నర దశాబ్దాల స్వతంత్ర భారతంలో ఇప్పటికీ కనీస సౌకర్యాలకు నోచుకోని పల్లెలు ఇంకా ఉన్నాయన్నారు. తాగునీటికి కూడా గ్రామీణులు నోచుకోకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి మచ్చు తునక అన్నారు. అవినీతి రహిత సమాజం కోసం పోరాడి సమాచార హక్కు చట్టం తీసుకువచ్చామన్నారు. 12 రోజుల దీక్ష తర్వాత సమాచార హక్కు చట్టం దస్త్రంపై రాష్ట్రపతి సంతకం చేశారని ఆయన గుర్తు చేశారు.
స.హ. చట్టం ద్వారానే ఆదర్శ్‌, 2జీ స్పెక్ట్రం, కామన్వెల్త్‌ క్రీడల కుంభకోణాలు వెలుగు చూశాయన్నారు. వ్యవస్థలో మార్పుతోనే అవినీతి అంతమవుతుందని తెలిపారు. తాము చేపట్టిన అవినీతి రహిత ఉద్యమంతో ఆరుగురు మంత్రులు పదవులు కోల్పోయారని తెలిపారు. ఇక జన్‌లోక్‌పాల్‌ సాధన తన ధ్యేయమని ఇందుకోసం తుదిశ్వాస వరకూ పోరాడుతానని తెలిపారు. జన్‌లోక్‌పాల్‌ అమల్లోకి వస్తే కనీసం 50 శాతం అవినీతిని అరికట్టవచ్చని పేర్కొన్నారు. యువత, విద్యార్థులు, మహిళలు, సామాన్య ప్రజలు అవినీతి వ్యతిరేక ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.