తెగతెంపుల సమయమిది తెగిస్తేనే తెలంగాణ
– 26న తెలంగాణ బంద్‌కు పిలుపు, అవసరమైతే 27న కొనసాగింపు
– ఆలోగా పార్టీల వైఖరి తెలపాలి
– మండల స్థాయిలో నిరాహార దీక్షలు
– క్షేత్రస్థాయి నుంచే నేతలపై ఒత్తిడి
– అనుకూల వైఖరి ప్రకటించని పార్టీలను తెలంగాణ నుంచి తరిమేయాలి
– టీ జేఏసీ చైర్మన్ కోదండరామ్
హైదరాబాద్, డిసెంబర్ 10 (జనంసాక్షి) :
తెలంగాణపై తెగతెంపుల సమయం ఆసన్నమైం దని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన టీ జేఏసీ విస్తృతస్థాయి సమావేశం లో ఆయన మాట్లాడారు. ఈనెల 23న కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై ఇచ్చిన మాట తప్పిన రో జున విద్రోహ దినం పాటించాలని పిలుపు నిచ్చారు. సీమాంధ్ర పార్టీలు ఈనెల 26 లోపు తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో 27, 28 తేదీల్లో సమావేశమై ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. సీమాంధ్ర పార్టీలైన టీడీపీ, వైఎస్సార్ సీపీ, అధికార పార్టీ కాంగ్రెస్ ఈలోగా తమ వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో 26న తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు తెలిపారు. అవరమైతే 27న కూడా బంద్ కొనసాగిస్తామన్నారు. 16 నుంచి 22 వరకు 16 నుంచి 22వరకు తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా అన్ని పార్టీల నాయకులతో ములాఖత్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. క్షేత్రస్థాయి నుంచే ఆయా పార్టీల నేతలపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. మండల స్థాయిలో రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బాధ్యత ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీపై ఉందని అన్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలంగాణ ద్రోహి అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన నీతి మాలిన వ్యక్తిగా అభివర్ణిచారు. జగ్గారెడ్డి వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదని అన్నారు. ఈ నెల 28న నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి ఎంత మంది హాజరు కావాలన్నది ముఖ్యం కాదని, హాజరైన వారంతా తెలంగాణ కోరుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు అనుకూల వైఖరి ప్రకటించని పార్టీలను ఈ ప్రాంతం నుంచి తరిమేయాలని పిలుపునిచ్చారు.