తెదేపాది వీధిబాగోతం

3
మంత్రి హరీష్‌

హైదరాబాద్‌,మార్చి26(జనంసాక్షి): తెలంగాణ టీడీపీ సభ్యుల వైఖరి వీధిబాగోతాన్ని తలపిస్తోందని మంత్రి హరీష్‌రావు ఎద్దేవా చేశారు. టీడీపీ శాసనసబ్యులు మరో వీధి నాటకం ఆడేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. ప్రభుత్వంపై టీడీపీ అవిశ్వాసం ఒక డ్రామా అని విమర్శించారు. సస్పెండైన సభ్యులకు నోటీసులిచ్చే హక్కు లేదని గుర్తు చేశారు. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానమని చెప్పి ఇప్పటికే టీడీపీ సభ్యులు అభాసుపాలయ్యారని తెలిపారు. తెలంగాణ టిడిపి సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోటీసు ఇచ్చారు. అయితే వారు సస్పెన్షన్‌ లో ఉన్నందున వారి నోటీసు చెల్లదని అన్నారు. టిడిపి ఎమ్మెల్యేలు కొత్త వీధి నాటకానికి తెరదీశారని ఆయన అన్నారు. వారు చేసేవి అన్నీ డ్రామాలేనని ఆయన విమర్శించారు. అసలు టిడిపి సభ్యులకు తాము ఏమి చేస్తున్నది అన్నదానిపై స్పష్టత లేదని ఆయన వ్యాఖ్యానించారు. సభబ ప్రారంభానికి ముందే అవిశ్వాసం నోటీసు ఇవ్వాలని తెలియదా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పక్ష నేత జనారెడ్డి ఇంటికి వెళ్లి టిడిపి నేతలు అభాసుపాలయ్యారని హరీష్‌ రావు ఎద్దేవ చేశారు. గురువారం హైదరాబాద్లో మంత్రి హరీష్రావు విలేకర్లతో మాట్లాడుతూ… అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిఒక్క సభ్యుడికి సభలో మాట్లాడే అవకాశం కల్పించామని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు సజావుగా నిర్వహించామని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే సమావేశాలు పొడిగించాలని తమను ఏ పార్టీకి చెందిన వారు అడగలేదన్నారు. ఎవరు అడగకుండానే సమావేశాలు ముగిశాయని అన్నారు. అన్ని సమస్యలపై చర్చ జరిగిందన్నారు. సమస్యలపై త్వరలోనే అఖిలపక్ష సమావేవం ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇదిలావుంటే  రుద్రమదేవి చిత్ర ఆడియో విడుదలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని నన్ను కోరారని మంత్రి హరీష్‌రావు తెలిపారు. అయితే తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయ కార్యక్రమాన్ని ఇంటర్వెల్‌ సమయంలో ప్రదర్శిస్తే… డిప్యూటీ సీఎం ఈ కార్యక్రమానికి హాజరవుతారని వారికి హావిూ ఇచ్చానని… తన ప్రతిపాదనకు వారు అంగీకరించారని… ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి రుద్రమదేవి ఆడియో ఫంక్షన్కు హాజరయ్యారని వెల్లడించారు.