తెదేపా, కాంగ్రెస్‌లు ముమ్మాటికీ ఆంధ్రా పార్టీలే

– తెలంగాణలో వాటికి స్థానం లేదు
– మంత్రి జగదీశ్‌రెడ్డి
నల్లగొండ, మే8(జ‌నం సాక్షి) : తెదేపా, కాంగ్రెస్‌ పార్టీలు ముమ్మాటికీ ఆంధ్రా పార్టీలేనని, తెలంగాణలో వాటికి స్థానం లేదని విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. నాగార్జునసాగర్‌ నియోజకవర్గం పరిధిలోని పెద్దవూర మండలం బట్టుగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్‌, సీపీఎం నేతలు, కార్యకర్తలు మంగళవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి కాంగ్రెస్‌, సీపీఎం కార్యకర్తలకు టీఆర్‌ఎస్‌ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం గ్రామంలో టీఆర్‌ఎస్‌ జెండాను మంత్రి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలు ముమ్మాటికీ ఆంధ్రా పార్టీలేనని నిప్పులు చెరిగారు. ఈ రెండు పార్టీల నేతలు పదవుల కోసం సీమాంధ్ర నేతలకు తెలంగాణను తాకట్టు పెట్టారని పేర్కొన్నారు. ఆ రెండు పార్టీలకు ఇకపై తెలంగాణలో చోటు ఉండదని మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. సాగర్‌ ఎడమ కాల్వకు ఇప్పుడు నీళ్లు ఇవ్వాలని జానారెడ్డి చేసిన డిమాండ్‌ హాస్యాస్పదంగా ఉందన్నారు. బహుశా కోసిన పంట మొదళ్లకు జానారెడ్డి నీరు అడిగి ఉండొచ్చు అని విమర్శించారు. వరుసగా 7 సంవత్సరాలు ఎడవ కాల్వ కింద భూములను ఎండబెట్టి ఆంధ్రాకు నీరిచ్చిన చరిత్ర కాంగ్రెస్‌ది అని మంత్రి జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వెలిబుచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి కాంగ్రెస్‌ నేతలు ఓర్వలేకపోతున్నారని, వాటిని అడ్డుకొనేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతును దేశానికే ఆదర్శంగానిలిపేందుకు కేసీఆర్‌ పట్టుదలతో ముందుకు సాగుతున్నారని మంత్రి పేర్కొన్నారు. దీనిలో భాగంగా రైతు సమన్వయ సమితుల ఏర్పాటు, 24గంటల విద్యుత్‌ సరఫరా, రైతులకు పెట్టుబడి చెక్కుల పంపిణీ వంటి పథకాలతో రైతులకు తెరాస ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. మే10 నుంచి రైతులకు అందించే చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని పండగలా నిర్వహించేందుకు రైతులందరూ సిద్ధంగా ఉన్నారని అన్నారు. గతంలో కాంగ్రెస్‌, తెదేపా పాలనల్లో రైతుల ఇబ్బందులు గురించి పట్టించుకోని నేతలు కేసీఆర్‌రైతులకు అండగా నిలుస్తుంటే విమర్శించడం సిగ్గుచేటన్నారు. మేము రైతులకు మేలు చేయలేదు.. విూరు చేయద్దు అన్నట్లుగా వారి వ్యవహారశైలి ఉందన్నారు. ప్రజలు కాంగ్రెస్‌, తెదేపా తీరును గమనిస్తున్నారని, 2019 ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఆ రెండు పార్టీలను పూర్తిస్థాయిలో తరిమికొట్టడం ఖాయమన్నారు.