తెరాసకు ప్రజలే బాసులు

– టీఆర్‌ఎస్‌ చేతిలో అధికారంలో ఉంటే నిర్ణయాలన్నీ ఇక్కడే

– కూటమికి అధికారం వస్తే ఢిల్లీ, అమరావతికి పోవాలి

– వచ్చేజూన్‌ నాటికి కాళేశ్వరం నీరు పొలాలకు చేరుతుంది

– ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌

సూర్యాపేట, నవంబర్‌23(జ‌నంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రజలే బాసులని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ చేతిలో అధికారం ఉంటే నిర్ణయాలన్నీ ఇక్కడే జరుగుతాయని, కూటమి అధికారంలోకి వస్తే ప్రజలు దరఖాస్తు పట్టుకుని ఢిల్లీకి, అమరావతికి పోవాల్సి వస్తుందని అన్నారు. ప్రజలంతా ఆలోచించి ఓటు వేయాలని కోరారు. సూర్యాపేట ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ ప్రసంగించారు. తెలంగాణ రాకపోతే.. కేసీఆర్‌ ముఖ్యమంత్రి కాకపోతే.. జగదీష్‌ రెడ్డి మంత్రి కాకపోతే ఈ జన్మలో కూడా సూర్యాపేట జిల్లా అయిఉండేది కాదని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో చాలా మంది చాలా మాటలు చెప్తారని, ఓటు ఆశామాషీగా వేయొద్దని సూచించారు. అది మన తలరాత మార్చుకునే ఆయుధంలాంటిదన్నారు. ఓటు వేసే ముందు అన్ని ఆలోచించుకొని ఓటు వేయాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ఏది మంచో..ఎవరు ఏం చేశారో ప్రజలకు తెలుసని, ప్రజాస్వామ్యంతో ఏది మంచిదైతే అదే గెలవాలవాలన్నారు. టీఆర్‌ఎస్‌ పాలన రాకముందు కరెంట్‌ ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉందో ప్రజలకు తెలుసని, తలసరి విద్యుత్‌ వినియోగంలో దేశంలో మనమే నంబర్‌ వన్‌ గా ఉన్నామన్నారు. రాత్రి, పగలు కష్టపడితే ఈ స్థాయికి వచ్చామని కేసీఆర్‌ తెలిపారు. సూర్యాపేట రాజకీయ చైతన్యం ఉన్న ప్రాంతమని అన్నారు. తెలంగాణ వస్తే రాష్ట్రం చిమ్మ చీకటి అవుతుందని కిరణ్‌ కుమార్‌ రెడ్డి అన్నాడని, ఇప్పుడు ఏపీలో 24 గంటల కరెంట్‌ లేదు.. కానీ మన దగ్గర ఉందని కేసీఆర్‌ తెలిపారు. అంగన్‌ ఆశావర్కర్ల జీతాలు పెంచామని, రైతు చనిపోతే కుటుంబం రోడ్డున పడకూడదని రైతుబీమా ప్రవేశపెట్టామన్నారు. రైతు ఏవిధంగా చనిపోయినా.. ఆ కుటుంబానికి వారం రోజుల్లో రూ.5 లక్షల బీమాసొమ్ము అందుతోందన్నారు. ప్రపంచంలోనే టాప్‌ 10 పథకాల్లో రైతు బంధు ఒకటని ఐక్యరాజ్యసమితి చెప్పిందని, వచ్చే జూన్‌ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీరు పొలాలకు అందుతుందని తెలిపారు. కాంగ్రెస్‌ నాయకులు ఎన్ని కేసులు వేసినా..ప్రాజెక్టుల నిర్మాణం ఆపలేదని అన్నారు. కేసీఆర్‌ కిట్‌ ద్వారా లక్షలాది మంది ఆడబిడ్డలకు మేలు జరుగుతోందని, గతంలో మహిళల ప్రసవాల కోసం ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లి వేలకు వేలు ఖర్చుచేశారన్నారు. ఇప్పుడు ప్రసవాల కోసం ఖర్చు చేయకుండా ప్రభుత్వమే రూ.12 వేల కేసీఆర్‌ కిట్‌ వస్తోంది. మానవీయ కోణంలో ప్రజా సమస్యల పరిష్కారమే ఇతివృత్తంగా పాలన సాగిస్తున్నామని కేసీఆర్‌ పునరుద్ఘాటించారు. పేదింటి ఆడపిల్లల పెళ్లికి రూ.లక్షా116 ఇస్తున్నామని, ప్రస్తుతం ఉన్న పెన్షన్‌ రెండింతలు పెంచుతామని, మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరందిస్తున్నామన్నారు . ఇలా 60ఏళ్ల పాలనలో కాంగ్రెస్‌, టీడీపీ పార్టీలు చేయలేని అద్భుతాలను నాలుగేళ్లలో చేసి చూపించామని కేసీఆర్‌ తెలిపారు. ప్రజలంతా ఆలోచించుకోవాలని, 60ఏళ్లలో జరిగిన అభివృద్ధి, నాలుగేళ్లలో జరిగిన అబివృద్ధిని చూడాలని, గ్రామాల్లో చర్చించాలని కేసీఆర్‌ ప్రజలకు సూచించారు.

 

తాజావార్తలు