తెరాస నాలుగేళ్ల పాలనలో..  అవినీతి అక్రమాలే!

– తెలంగాణ నిధులను ఆంధ్రా కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారు
– ప్రాజెక్టుల వ్యయం కంటే 30శాతం అదనంగా ఖర్చుచేశారు
– మేం అధికారంలోకి రాగానే అవినీతిపై దర్యాప్తు చేయిస్తాం
– అక్రమాలకు పాల్పడినవారిపై కొరడాఝుళిపిస్తాం
– విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ నేత జైపాల్‌రెడ్డి
హైదరాబాద్‌, అక్టోబర్‌15(జ‌నంసాక్షి) : తెలంగాణ రాష్ట్రంలో నాలుగేళ్ల పాలనలో టీఆర్‌ఎస్‌ నేతలు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అవినీతిపై దర్యాప్తు చేస్తామని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం గాంధీభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో జైపాల్‌రెడ్డి మాట్లాడారు.. తెలంగాణ నిధులను ఆంధ్రా కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. మెగాకృష్ణారెడ్డికి వేలకోట్ల కాంట్రాక్టులను కట్టబెట్టారని ఆయన విమర్శించారు. మెగా కృష్ణారెడ్డికి కాళేశ్వరంలోనే రూ.27,407 కోట్లు పనులు అప్పజెప్పారన్నారు. పాలేరు, సీతారామా, డిండి ప్రాజెక్టుల్లో దాదాపు రూ.8వేల కోట్లకు పైగా పనులు ఇచ్చారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం ఎందుకు పెరిగిందని ప్రశ్నించారు. మెగా పనుల వల్ల ఒక్క ఎకరానికి నీరు రాలేదని, ఒక్క ఇంటికి నీరు చేరలేదన్నారు. ప్రాజెక్టుల అసలు వ్యయం కంటే 30శాతం నిధులు అధికంగా ఖర్చు చేశారని జైపాల్‌ రెడ్డి మండిపడ్డారు. తాను చెప్పిన లెక్కలు తప్పయితే కేసీఆర్‌ చెప్పాలని జైపాల్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ ఆర్భాటపు మాటలు మానుకోవాలన్నారు. ఎన్నికల తర్వాత కేసీఆర్‌ పరిస్థితి ఏంటో ఊహించుకోవాలన్నారు.  అక్రమంగా పనులు దక్కించుకున్న అన్ని సంస్థలపై నిషేధం విధిస్తామన్నారు. పారదర్శకంగా టెండర్లు దక్కించుకున్న వారికి ఎలాంటి సమస్య ఉండదని పేర్కొన్నారు. మిషన్‌ భగీరథ ద్వారా గ్రామాలకు నీరు చేరలేదు కానీ.. పైపులైన్‌ మాత్రం పూర్తి చేశారన్నారు. పనులు దక్కించుకున్న సంస్థలకు పైపుల కంపెనీ ఉంది కాబట్టి పైపులైన్‌ మాత్రమే పూర్తి చేశారన్నారు. గుత్తేదారులకు బానిసగా మారి తెలంగాణను అప్పులపాలు చేశారని  జైపాల్‌రెడ్డి అన్నారు.