తెరాస హయాంలోనే.. అన్ని వర్గాల అభివృద్ధి
– నాలుగేళ్లలో అన్నదాతలకు అండగా నిలిచాం
– వ్యవసాయాన్ని పండుగ చేసిన ఘనత కేసీఆర్‌ది
– మళ్లీ ఆశీర్వదించండి.. బంగారు తెలంగాణగా మార్చుకుందాం
– ఎంపీ నర్సయ్యగౌడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి
– రామన్నపేటలో ఎమ్మెల్యే అభ్యర్థి విరేశలింగం ఎన్నికల ప్రచారం
యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్29(జనంసాక్షి) : నాలుగేళ్ల తెరాస పాలనలో అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేసిన ఘత కేసీఆర్‌ది అని, మరోసారి ఆశీర్వదించి బంగారు తెలంగాణ సాధనకు సహకరించాలని ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, రామన్నపేట ఎమ్మెల్యే అభ్యర్థి వీరేశలింగంలు ప్రజలను కోరారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లాలో తాజా, మాజీ ఎమ్మెల్యే వేముల విరేశలింగం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం భారీ ఎత్తున బైక్ ర్యాలీ చేపట్టారు.
రామన్నపేట మండల కేంద్రం నుండి వేముల వీరేశం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. అనంతరం ముఖ్యకార్యకర్తల సమావేశంతో పాటు.. పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డిలు మాట్లాడుతూ.. గతంలో టీడీపీకి పట్టం కట్టబెడితే కరెంటు తీగలపై బట్టలు ఆరవేసే కోవచ్చని మనం మనల్ని అవహేళన చేసారని గుర్తు చేశారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ.. 24గంటల నిరంత విద్యుత్ ను అందిస్తున్న ఘనత కేసీఆర్‌ది అన్నారు. నాలుగేళ్ల కాలంలో అన్ని వర్గాల అభివృద్ధి కేసీఆర్ కృషి చేశారని అన్నారు. ఆంధ్రాపాలకుల 60ఏళ్ల పాలనలో జరగని అభివృద్ధిని నాలుగేళ్లలో చేసి చూపించిన ఘనత తెరాస ప్రభుత్వానిదేనన్నారు. గత పాలకులు తెలంగాణలో వ్యవసాయాన్ని దండగగా మార్చారని, నాలుగేళ్ల తెరాస పాలనలో ప్రాజెక్టులను నిర్మించి వ్యవసాయాన్ని పండుగగా మార్చారన్నారు. ఈసారి టీడీపీ పార్టీ నాయకులు అమరావతి చుట్టూ ప్రదక్షిణలు చేయడం జరుగుతుందని ఎద్దేవ చేశారు. అదే మన టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మన తెలంగాణ బిడ్డల కష్టసుఖాలు తెలిసినవారు.. ప్రజలతో మమేకమై ఉన్నవారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని, మనకు చెప్పని ఎన్నో పథకాలను అమలు చేయడం జరిగిందని అన్నారు.
అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం మాట్లాడారు. గత నాలుగున్నర సంవత్సరాలలో నిత్యం ప్రజల్లో మమేకమై వారి కష్టసుఖాల్లో పాలు పంచుకోవడం జరిగిందన్నారు. ఎప్పుడూ ప్రజల మధ్య ఉంటూ నియోజకవర్గ అభివృద్ధిలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక నిధులు మనకు కేటాయించడం జరిగిందన్నారు. నాపై నమ్మకంతో అధినేత కేసీఆర్ అండదండలతో నకిరేకల్ నియోజకవర్గం సాగు, తాగునీటితో పాటు నియోజకవర్గం అన్ని స్థాయిలో అభివృద్ధిలో ముందంజలో ఉంచుతానని తెలిపారు.