తెలంగాణను అడ్డుకునేందుకే ప్రత్యేక రాయలసీమ నినాదం
ఇది కొత్త బిచ్చగాళ్ల నాటకం
సీపీఐ సీనియర్ నాయకుడు అజీజ్ పాషా
హైద్రాబాద్, ఆగస్టు 30(జనంసాక్షి): తెలంగాణను అడ్డుకొపేందుకే ప్రత్యే రాయలసీమ వాదాన్ని తెరపైకి తెచ్చారని, ఇవన్నీ కొత్త బిచ్చగాళ్ల నాటకాలని సిపిఐ కేంద్ర కార్యవర్త సభ్యులు అజీజ్‌పాషా అన్నారు. తెలంగాణ సాధనకై సిపిఐ చేపట్టిన పోరుయాత్ర గురువారం హైద్రాబాద్ నగరంతో పాటు, రంగారెడ్డి జిల్లాలో కొనసాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు బహిరంగసభల్లో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు సమయంలోనే దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఇష్టం లేకపోతే తెెలంగాణ విడిపోవచ్చని చెప్పారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటినుండి తెలంగాణకు నీళ్లు, నిధులు అన్ని రంగాలలో మోసం జరుగుతూనే ఉందని, పెద్ద మునుషుల ఒప్పందం, 610 జీవో అమలులోనూ ఉల్లంఘన జరుగుతూనే ఉందన్నారు. అందుకే ప్రత్యేక రాష్ట్రంతోనే తెలంగాణ ప్రజల సమస్యలు తీరుతాయని, తెలంగాణ రాష్ట్ర సాధనకై సీపీఐ ఉద్యమిస్తుందని తెలిపారు. తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసిన డిసెంబర్9 ప్రకటన తర్వాత టీడీపీ వెనక్కి పోయిందన్నారు. ఆయన మాట మీద నిలబడితే తెలంగాణ ప్రజల సమస్యలు తీరి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు జరిగి ఉండేదన్నారు. కానీ రెండు కళ్ల సిద్దాంతంతో రాయలసీమలో ప్రత్యేక రాయలసీమ వాదాన్ని ప్రోత్సాహిస్తున్నాడని ఆరోపించారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ కూడా తెలంగాణపై తన నిర్ణయాన్ని తెలియచేయాలన్నారు. ఈ పోరు యాత్రకు హైద్రాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఘన స్వాగతం లభించింది. అడుగడుగునా జేఏసీ నాయకులు స్వాగతం తెలిపారు. ఓయూ జేఏసీ నాయకులు, తెలంగాణ ప్రజా ఫ్రంట్ నాయకులు సైతం ఈ పోరు యాత్రకు సంఘీభావం తెలిపి యాత్రలో పాల్గొన్నారు. ఈ యాత్రలో సిపిఐ కార్యదర్శి నారాయణ, పార్టీ నాయకులు చాడ వెంకట్‌రెడ్డి, పల్లా వెంకటరెడ్డి, పిజె చంద్రశేఖర్‌రావు, వి నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.