తెలంగాణపై కాంగ్రెస్‌ పెద్దల తలోమాట

తెలంగాణకు కట్టుబడి ఉన్నాం : చాకో
మూడు ప్రాంతాలను ఒప్పించాలి : ఆజాద్‌
ఇంకొంచెం సమయం కావాలి : షిండే
న్యూఢిల్లీ, జనవరి 30 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్‌ పార్టీ పెద్దలు తలో మాట మాట్లాడారు. వేర్వేరు ప్రాంతాల్లో పార్టీ ముఖ్యులు వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి కాంగ్రెస్‌ కట్టుబడి ఉంది అని చెప్పుకునేందుకు బాగానే కష్టపడ్డారు. ముందుగా న్యూ ఢిల్లీలో ఏఐసీసీ అధికార ప్రతినిధి విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణ అంశంపై సంప్రదింపులు కొనసాగుతున్నాయని తెలిపారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఏడుగురు ఎంపీల రాజీనామాలను పొన్నం ప్రభాకర్‌ సోనియాగాంధీకి రాజీనామా లేఖలు అందించిన తర్వాత చాకో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ తెలంగాణకు వ్యతిరేకం కాదని తేల్చిచెప్పారు. తెలంగాణపై కాంగ్రెస్‌ వైఖరిని ఇప్పటికే తేల్చిచెప్పామన్నారు. ఆ తర్వాత ఒడిశాలో విలేకరులతో మాట్లాడిన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌ సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతుందన్నారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి మరికొంత సమయం పడుతుందన్నారు. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులతో సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఒక ప్రాంతం వారు విభజన కోరుకుంటే రెండు ప్రాంతాల వారు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో మూడు ప్రాంతాల వారితో ఏకాభిప్రాయానికి వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. రెండేళ్లుగా ఏకాభిప్రాయ సాధనకు కృషి చేస్తూనే ఉన్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు సంయమనం పాటించాలని, తెలంగాణ అంశం చాలా సున్నితమైనదని హోం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే పేర్కొన్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికి మరికొంత సమయం పడుతుందన్నారు.