తెలంగాణపై తప్పించుకోలేం లేఖ ఇవ్వడం అనివార్యం

సీమాంధ్ర నేతలను బుజ్జగిస్తున్న బాబు
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 11 (జనంసాక్షి) :

తెలంగాణ అంశంపై స్పష్టమైన నిర్ణయం తీసుకునేందుకు చర్చలు ప్రారంభించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం కూడా చర్చలను కొనసాగించారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వడంపై ఏకాభిప్రాయం తీసుకువచ్చేందుకు కసరత్తు చేపట్టారు. ఈ అంశంపై పార్టీ సీమాంధ్ర నేతలతో మంగళవారం కూడా సంప్రదింపులు జరిపారు. పార్టీ సీనియర్‌ నేతలు పయ్యవుల కేశవ్‌, గాలి ముద్దుకృష్ణమ నాయుడు, బొజ్జల గోపాలకృష్ణ తదితరులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. తన మనసులోఉన్న మాటను వెల్లడించిన చంద్రబాబు.. తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత, అనుకూలంగా తీసుకుంటే కలిగే లాభ నష్టాలు తదితర అంశాలపై వారికి వివరించారు. ‘ఒక రాజకీయ పార్టీగా తెలంగాణపై స్పష్టమైన వైఖరి తీసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణపై గతంలోనే పార్టీపరంగా నిర్ణయం తీసుకొన్నాం. దానికి కట్టుబడి ఉందాం. ఇప్పటికే తెలంగాణ నేతలకు మాట ఇచ్చేశాను. ఇప్పుడు వెనక్కు వెళ్లగలిగే పరిస్థితి లేదు. ఈ నిర్ణయం వల్ల రెండు ప్రాంతాల్లో పార్టీకి లాభం చేకూరుతుంది. సీమాంధ్రలో కొద్దిగా వ్యతిరేకత వచ్చినా దాని ప్రభావం పెద్దగా ఉండదని’ చెప్పారు. తెలంగాణలో పార్టీ బలంగా ఉందని, స్పష్టమైన వైఖరి తీసుకోకపోవడం వల్ల నష్టపోవాల్సి వస్తోందని వివరించారు. అందుకే తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్దామని తెలిపారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వడం ద్వారా కాంగ్రెస్‌పై ఒత్తిడి పెరుగుతుందని, వారు కూడా ఏదో నిర్నయం తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడుందని నేతలతో చెప్పినట్లు సమాచారం. అయితే, చంద్రబాబు ప్రతిపాదనపై పయ్యవుల, గాలి గట్టిగా వ్యతిరేకించినట్లు తెలిసింది. డిసెంబర్‌ 9నాటి ప్రకటన తర్వాత సీమాంధ్రలో భావోద్వేగాలు చెలరేగాయని, అప్పట్లో సమైక్యాంధ్ర కోసం పార్టీ తరఫున గట్టిగా పోరాడామని, ఇప్పుడు వెనక్కు తగ్గితే ప్రజల్లో చులకన అవుతామని వారు చెప్పినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వ వైఖరితో తెలంగాణ వచ్చే అవకాశం లేదన్న అభిప్రాయంతో ప్రస్తుతం అక్కడ ఉద్యమాలు చేయడం లేదు. మళ్లీ ఆ పరిస్థితి తలెత్తితే మరోసారి ఉద్యమం తెప్పదని’ హెచ్చరించినట్లు తెలిసింది. రాష్టాన్న్రి విభజించాలా? వద్దా? అన్నది అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీయేనని, నిర్ణయం తీసుకోవాల్సిన కాంగ్రెస్‌ తన వైఖరి వెల్లడించనప్పుడు మనమేందుకు స్పష్టత ఇవ్వాలని పయ్యవుల అన్నట్లు తెలిసింది. అయితే, బొజ్జల తదితరులు కాస్త ఘాటుగానే మాట్లాడినట్లు తెలిసింది. అవసరమైతే రాజీనామాలకు కూడా సిద్ధమన్నట్లు సమాచారం. అయితే, వారిని బాబు బుజ్జగించే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. మనం ఇదివరకే తెలంగాణపై స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకున్నామని, దానికి కట్టుబడి ఉన్నామని చెప్పి కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచేందుకే స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని బాబు అన్నట్లు తెలిసింది. బాబుతో భేటీ అనంతరం పయ్యావుల విూడియాతో మాట్లాడారు. తెలంగాణపై చంద్రబాబుదే తుది నిర్ణయం అని కప్పారు. పార్టీ ప్రయోజనాలతో పాటు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ అంశంపై తమ అభిప్రాయాలను బాబుకు చెప్పామని, నిర్ణయం తీసుకోవాల్సింది ఆయనేనని స్పష్టం చేశారు.