తెలంగాణపై త్వరగా తేల్చండి

సోనియాకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల బృందం లేఖ
బలిదానాలు వద్దు
త్యాగాలకు వెనకాడం : గండ్రహైదరాబాద్‌, ఫిబ్రవరి 8 (జనంసాక్షి):
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం హైకమాండ్‌పై ఒత్తిడి పెంచాలని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు నిర్ణయించారు. ప్రత్యేక రాష్టాన్న్రి వెంటనే ఏర్పాటు చేయాలని హైకమాండ్‌కు లేఖ రాయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. మంత్రులతో చర్చించి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించనున్నట్లు ఎమ్మెల్యేలు వెల్లడించారు. శుక్రవారం సీఎల్పీ కార్యాలయంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు.చీఫ్‌విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి, విప్‌ అనిల్‌, భిక్షమయ్యగౌడ్‌, శ్రీధర్‌, అబ్రహం, నర్సారెడ్డి, కిష్టారెడ్డి, ముత్యంరెడ్డి, నందీశ్వర్‌గౌడ్‌ తదితరులు సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో తెలంగాణ అంశం, తాజా రాజకీయ పరిణామాలు, యువత ఆత్మహత్యలు తదితర అంశాలపై చర్చించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం హైకమాండ్‌పై ఏవిధంగా ఒత్తిడి తేవాలనే దానిపై చర్చ జరిగింది. ఉద్యమ బాట పట్టాలని కొందరు, ఢిల్లీ వెళ్లాలని మరికొందరు అభిప్రాయాలు వెల్లడించారు. అయితే, నిర్దిష్ట అభిప్రాయానికి రాలేదు. మధ్యేమార్గంగా హైకమాండ్‌కు లేఖ రాయాలని తీర్మానించారు. ప్రత్యేక రాష్టాన్న్రి వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతూ సోనియాకు లేఖ రాయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. తెలంగాణ అంశాన్ని త్వరగా తేల్చాలని హైకమాండ్‌పై ఒత్తిడి పెంచేందుకు భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించాలని భావించారు. అయితే, మంత్రులతో చర్చించాకే కార్యాచరణ ప్రకటించాలని పలువురు పేర్కొనడంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారు. యువకుల ఆత్మహత్యలపై పలువురు ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను సత్వరమే పరిష్కరించకపోతే మరింత మంది కూడా బలవన్మరణానికి పాల్పడే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే తెలంగాణను త్వరగా తేల్చేయాలని హైకమాండ్‌కు లేఖ నిర్ణయించారు. భేటీ ముగిసిన అనంతరం ఎమ్మెల్యేలతో కలిసి చీఫ్‌ విప్‌ గండ్ర విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ కోసం యువత ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్టాన్న్రి ఏర్పాటు చేయాలని కోరుతూ సోనియాకు లేఖ రాయాలని నిర్ణయించామని తెలిపారు. తెలంగాణ కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నామని పునరుద్ఘాటించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మరింత సమయం కావాలని అధిష్టానం పేర్కొనడంతో తాము తీవ్ర నిరాశకు గురయ్యామన్నారు. సత్వరమే నిర్ణయం తీసుకొనేలా హైకమాండ్‌పై ఒత్తిడి తీసుకువస్తామని చెప్పారు. త్వరలోనే మంత్రులతో సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. సహకార ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మెజార్టీ సీట్లు కైవసం చేసుకోవడంపై గండ్ర హర్షం వ్యక్తం చేశారు.