తెలంగాణలో అవినీతి తాండవం చేస్తోంది

యాదాద్రి(జ‌నం సాక్షి ) : తెలంగాణలో అడుగడుగునా అవినీతి తాండవం చేస్తోందని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఆరోపించారు. ఆయన ఆదివారం యాదాద్రి కొండపైన మీడియాతో మాట్లాడారు. టీచర్ల బదిలీలు, రైతుబంధు పథకం అమలులో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని, వీటిపై ప్రశ్నించిన ప్రతిపక్షాల గొంతును తెలంగాణ ప్రభుత్వం అణచివేస్తోందని మండిపడ్డారు.రైతుల కోసం కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అమలు చేయడంలేదని ఆయన ప్రశ్నించారు. కేంద్రంపై రాష్ట్రప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని మానుకోవాలని హితవుపలికారు. కేంద్రం ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజలకు వివరించి, వారికి మరింత దగ్గరవుతామన్నారు. కేంద్రం తెలంగాణకు చేస్తున్న సాయంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి కార్యాచరణ సిద్దం చేశామని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని దత్తాత్రేయ స్పష్టంచేశారు.