తెలంగాణలో కాంగ్రెస్‌, బీజేపీలకు స్థానం లేదు: మంత్రి నిరంజన్‌ రెడ్డి

తెలంగాణ రాష్ట్రం ఎవరి భిక్ష కాదని, పోరాడి సాధించుకున్నామని మంత్రి నిరంజన్‌ రెడ్డి  అన్నారు. తెలంగాణ  పోరాటాలను కాంగ్రెస్‌ పార్టీపదేపదే అవమానిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్‌ పార్టీ చేసిన కాలయాపన ఫలితంగానే తెలంగాణలో ఆత్మబలిదానాలు జరిగాయని విమర్శించారు. కాంగ్రెస్‌ చర్యలతో తెలంగాణ రెండు తరాల భవిష్యత్‌ను కోల్పోయిందని చెప్పారు. 48 ఏండ్ల కాంగ్రెస్‌ పాలనలో వివక్ష, అసమానతల ఫలితమే తెలంగాణలో దుర్భిక్షమని వెల్లడించారు. తెలంగాణను ఎండబెట్టి, ప్రజలను వలసల పాలు చేసి ఆంధ్రాకు నీటిని తరలించుకుపోయారని ఫైర్‌ అయ్యారు.తెలంగాణలో అధికారం కోసమే అమలుకు సాధ్యం కాని హామీలను ఆ పార్టీ ఇస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో హామీలు అమలు చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్‌ చేశారు. జాతీయ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్‌.. రాష్ట్రానికో విధానం అవలంభిస్తున్నదని ఎద్దేవాచేశారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీలకు స్థానం లేదని స్పష్టం చేశారు.