తెలంగాణలో కొనసాగుతున్న వలసలు
టిఆర్‌ఎస్‌లోకి ఆదిలాబాద్ మాజీ మున్సిపల్ ఛైర్మన్
ఆదిలాబాద్,అక్టోబర్10(జనంసాక్షి): తెలంగాణ వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌లోకి భారీగా వలసలు కొనసాగు తున్నాయి. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై అధికార పార్టీలో చేరుతున్నారు. ఆదిలాబాద్ మాజీ ఎంపీ కందుల ఆశన్న కుమారుడు, మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ కందుల సుఖేందర్ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీని వీడి మంత్రి జోగు రామన్న సమక్షంలో బుధవారం టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, టీఆర్‌ఎస్ ప్రవేశపెట్టిన పథకాలు అద్భుతంగా ఉన్నాయని సుఖేందర్ అన్నారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ లో మనుగడ లేదన్నారు. అదిలాబాద్ జిల్లాలో పలువురు ముఖ్య నేతలు టీఆర్‌ఎస్‌లో చేరారని అన్నారు. మంత్రి జోగు రామన్న తన నివాసంలో సుఖేందర్ తో పాటు సుఖేందర్ అనుచరులకు గులాబీ కండువా కప్పి టీఆర్‌ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి జోగు రామన్న మాట్లాడారు. గత నాలుగున్నర ఏళ్ల కాలంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ నాయకత్వంలో చేసిన అభివృద్ధిని చూసి సుఖేందర్ తన అనుచరులతో టీఆర్‌ఎస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు. మున్ముందు అదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు చాలా మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్ పార్టీలోకి వచ్చేందుకు సిద్దం అయ్యారని.., పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు పార్టీని వీడనున్నారని మంత్రిజోగురామన్న తెలిపారు.