తెలంగాణలో చంద్రబాబు పెత్తనం అవసరమా?

నల్లగొండ నేతలే భుజానకెత్తుకుంటున్నారు

నకిరేకల్‌ సభలో మండిపడ్డ సిఎం కెసిఆర్‌

నల్లగొండ,నవంబర్‌21(జ‌నంసాక్షి): నాలుగేళ్ల తెలంగాణ అభివృద్ది కళ్లకు కట్టినట్లుగా ఉందని సిఎం కెసిర్‌ అన్నారు. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. తెలంగాణపై పెత్తనం చేయడానికి మళ్లీ చంద్రబాబు వస్తున్నారని, ఆయన అసవరం మనకు ఉందా చెప్పాలని ఆయన ప్రజలను అడిగారు. ప్రజలు వద్దని చెప్పడంతో… ఈ ప్రాంత నాయకులే భుజానికి ఎత్తుకుని వస్తున్‌ఆనరని ఎద్దేవా చేశారు. బుధవారం నకిరేకల్‌లో జరిగిన సభలో కెసిఆర్‌ మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ఆశీర్వాద సభలకు వచ్చే జనాలను చూస్తుంటే నియోజకవర్గ సభలా..జిల్లా సభలా అనిపిస్తోందని సీఎం కేసీఆర్‌ అన్నారు. నకిరేకల్‌ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగిస్తూ..తెలంగాణ తెస్తానంటే ఎవరూ నమ్మలేదని, బక్కపలచని మనిషితో ఏమవుతుందిలే అనుకున్నారని అన్నారు. ఎన్ని అడ్డంకులెదురైనా 14 ఏళ్ల కఠోర శ్రమతో రాష్ట్రం సాధించిన. ప్రభుత్వాన్ని నడపమని నన్ను ఆశీర్వదించారు. ఈ నాలుగేళ్లలో ఏం జరిగిందో విూరే ప్రత్యక్షంగా చూస్తున్నరు. ఆరేడు నెలల్లోనే కరెంట్‌ సమస్య పరిష్కరించుకున్నం. గ్రామంలో వృద్దులంతా కేసీఆర్‌ పెద్ద కొడుకుగా భావిస్తున్నారు. ఎక్కడాలేనన్ని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు చేసుకున్నం. కులమత భేదాలు లేకుండా అన్ని వర్గాలను కలుపుకొని పోతున్నం. వ్యవసాయానికి, పరిశ్రమలకు నిరంతర విద్యుత్‌ ఇస్తున్నమని సీఎం తెలిపారు. అభివృద్ధి ఎంత జరిగిందో నాకంటే ఎక్కువ విూరు ఉపన్యాసం ఇస్తున్నరు. కాంగ్రెస్‌, టీడీపీలు కలిసి రైతాంగాన్ని గోసపెట్టినయి. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా రైతాంగానికి నాణ్యమైన కరెంట్‌ ఇస్తున్నం. ఆంధ్రా నాయకులకు తెలివిలేదు కాబట్టే రైతులకు 24 గంటలకు కరెంట్‌ ఇవ్వడం లేదని మండిపడ్డారు. రైతు బీమా చాలా అద్భుతమైన పథకం. 3400 రైతు కుటుంబాలను రైతు బీమాతో ఆదుకున్నామని సీఎం అన్నారు. కుంభకోణాలు, లంబకోణాలకు తావు లేకుండా సంపద పెంచినం. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పేదలకిచ్చే పెన్షన్‌ రెండింతలు చేస్తం. వేముల వీరేశం లక్ష ఓట్ల మెజార్టీతో గెలవడం ఖాయమని స్పష్టమవుతోందని సీఎం ధీమా వ్యక్తం చేశారు.