తెలంగాణలో పలు చోట్ల గాలివాన బీభత్సం

5

వరంగల్‌,ఖమ్మం, కరీంనగర్‌లలో భారీ నష్టం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 24 (జనంసాక్షి):

తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. పలుచోట్ల పంటలు నీట మునిగాయి. నల్గొండ జిల్లా ఆలేరులో భారీ వర్షం కారణంగా ధాన్యం నీటమునిగింది. వరంగల్‌ జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దుగ్గొండి మండలం చాపలబండలో గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో పలు ఇళ్ల పైకప్పులు కూలాయి. విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. ఈదురుగాలుల కారణంగా నర్సంపేట సవిూపంలోని మహేశ్వరం వద్ద రహదారిపై చెట్లు విరిగిపడ్డాయి. గూడూరులోనూ వర్షం కురిసింది. అలాగే జిల్లాలోని తాడ్వాయి, ఏటూరునాగారం, కొత్తగూడ మండలాల్లో అకాల వర్షాలకు వరి, మొక్కజొన్న నీటమునిగాయి. మామిడి కాయలు నేలరాలాయి. తాడ్వాయి-ఏటూరు నాగారం మధ్య ప్రధాన రహదారిపై చెట్టు విరిగిపడింది. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చెన్నారావుపేట మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం తెల్లవారుజామున గాలి దుమారంతో మొదలైన వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. మండల పరిధిలోని అవిూనాబాద్‌, అవిూన్‌పేట, తూర్పెల్లి, లింగగిరి, బాపునగర్‌, జల్లి, ఎల్లయ్యగూడెం తదితర గ్రామాల్లో వర్ష ప్రభావం అధికంగా ఉంది. 275 హెక్టార్లలో వరిపంట, 150 హెక్టార్లలో మొక్కజొన్న, 10 హెక్టార్లలో మామిడి, 5 హెక్టార్లలో బొప్పాయి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన పంటలు వర్షార్పణం కావడంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆయా గ్రామాల్లో విద్యుత్తు వ్యవస్థ పూర్తిగా ధ్వంసమయ్యింది. విద్యుత్తు స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు గాలి దుమారానికి విరిగిపోయాయి. వరంగల్‌-నర్సంపేట రహదారి ధర్మారం వద్ద వర్షం కారణంగా చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. ఖమ్మం జిల్లా భద్రాచలంలో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం కురిసింది. పట్టణంలో మేఘాలు దట్టంగా కమ్ముకోవడంతో ఉదయం పూట వాహనాల లైట్ల వెలుతురులో ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మధిర, కొత్తగూడెం, మణుగూరు, వెంకటాపురం, దమ్మగూడెం, చర్ల, వాజేడు, మండలాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. ఇంకూర్‌లో భారీ వర్షం కారణంగా మిర్చి పంట తీవ్రంగా దెబ్బతింది.  కరీంనగరల్‌ జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్నవడగండ్ల వర్షాలకు పదివేల ఎకరాల్లో వరి, మామిడి పంటలకు నష్టం వాటిల్లింది. జిల్లాలోని ముదిమాణిక్యం, రామంచ, ఇందుర్తిలో జరిగిన పంటనష్టాన్ని కలెక్టర్‌ నీతుకుమారీప్రసాద్‌ పర్యవేక్షించారు. ఆమెతో పాటు వచ్చిన వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టంపై వివరాలు సేకరించారు. ఇదిలా ఉండగా హుస్నాబాద్‌లో పంట నష్టపోయిన వారికి వెంటనే పరిహారం ఇప్పించాలని డిమాండ్‌ చేస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. రహదారిపై వాహనాల రాకపోకలను అడ్డుకొని ధర్నా నిర్వహించారు. తెలంగాణ

రాష్ట్రంలో చూస్తే.. ఏటూరు నాగారం, గోవిందరావుపేటలో 7, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, ఖమ్మం జిల్లా ఇల్లెందు, వెంకటాపురంలలో 6, కొత్తగూడెం, గుండాలలో 5 సెంటీ విూటర్ల వర్షం నమోదైంది.