తెలంగాణలో పెరుగుతున్న డెంగ్యూ కేసులు
రోజుకు 1500లకు పైగా కేసులు నమోదు
హైదరాబాద్,ఆగస్ట్18(జనంసాక్షి): రాష్ట్రంలో హైదరాబాద్, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో డెంగీ కేసులు భారీగా నమోదవుతున్నాయని ప్రజారోగ్య సంచాలకుడు జీ శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1200కుపైగా డెంగీ కేసులు వచ్చాయన్నారు. 13 జిల్లాల్లో మలేరియా, డెంగీ అధికంగా ఉన్నట్టు గుర్తించామని ఆయన తెలిపారు. బుధవారం కింగ్‌కోఠిలోని ఆయన కార్యాలయంలో విలేకరులతో డీహెచ్ మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ చాలావరకు అదుపులోకి వచ్చిందన్నారు. ఇక్కడ కొవిడ్ సెకండ్ వేవ్ ముగిసిందని తెలిపారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జ్వరం వస్తే కొవిడ్‌యే అనుకోవద్దని ప్రజలకు సూచించారు. జ్వరం వస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భద్రాద్రి, ములుగు జిల్లాల్లో 340 మలేరియా కేసులు నమోదయ్యాయన్నారు. దోమలు, లార్వా వృద్ధి నివారణ చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్రంలోని 20 జిల్లాల్లో తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లు నడుస్తున్నాయని తెలిపారు.
రాష్ట్రంలో 1.65 కోట్ల మందికి కొవిడ్ వ్యాక్సినేషన్
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 1.65 కోట్ల మందికి కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చినట్టు ఆయన తెలిపారు. . 56 శాతం మందికి తొలి డోస్ వేశామని, 34 శాతం మందికి రెండు డోసులు పూర్తి చేసినట్టు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో దాదాపు 100శాతం మందికి.. జీహెచ్‌ఎంసీలో 90శాతం మందికి కనీసం ఓ డోస్ పూర్తి చేశామని చెప్పారు.