తెలంగాణలో మెండుగా ఉపాధి అవకాశాలు

5

– జిల్లాకో స్కిల్‌ సెంటర్‌

– సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,మే1 (జనంసాక్షి):

రాష్ట్రంలో ఉపాధి అవకాశాలను మెరుగు పరచడానికి అన్ని మార్గాలను ఆలోచిస్తున్నామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. చదువుకున్న చదువులకు సరైన ఉపాధి దొరికే విధంగా ప్రణాళికలు చేస్తన్నామని చెప్పారు. మేడే సందర్భంగా రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున స్కిల్‌ డెవెలప్‌మెంట్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీనికి కేంద్రం సహాయం కూడా అవసరమని చెప్పారు. దీనిద్వారా విద్యార్థులకు స్కిల్‌ శిక్షణ ఇచ్చేలా చూస్తామన్నారు. స్కిల్‌ డెవెలప్‌మెంటు సెంటర్లను నేరుగా పరిశ్రమలకు, సంస్థలకు అనుసంధానం చేసి యువతకు ఉద్యోగాలు వచ్చేలా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రభుత్వం కన్నా ప్రైవేటు రంగంలోనే ఉపాధి అవకాశాలు ఎక్కువని, అందుకే యువత ఆ రంగం వైపు వెళితే ఖచ్చితంగా ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుందని చెప్పారు. మన వద్ద ఇప్పటి వరకు చదవులు నాణ్యత లేనివని, దీనివల్ల డిగ్రీలు తప్ప విద్యార్థులకు సరైన స్కిల్స్‌ లేక ఉపాధి పొందడంలో వెనుకబడిపోతున్నారని చెప్పారు. ఆయా కంపెనీల అవసరాల మేరకు వారికి అనుగుణంగా ఈ శిక్షణ ఉంటుందన్నారు. డిగ్రీ పొందిన వెంటనే స్కిల్‌ డెవెలప్‌మెంట్‌ సెంటర్‌ ద్వారా సంబంధిత రంగంలో ఉద్యోగం సంపాదించేలా విద్యార్థిని స్కిల్‌ డెవెలప్‌మెంట్‌ సెంటర్లు తీర్చి దిద్దుతాయని చెప్పారు. ఇదంతా గత ప్రభుత్వాలలాగా ఆషామాసిగా కాకుండా పకడ్బందీగా నిర్వహించి వాటి ద్వారా అద్భుతమైన ఫలితాలు సాధించేందుకు ప్రభత్వం తరపున పూర్తి పర్యవేక్షణ ఉంటుందని సీఎం చెప్పారు. ప్రస్తుతం కాలేజీల్లో చదువులు అంతంతమాత్రంగా ఉండడం వల్ల విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపిక కావడం లేదన్నారు. వారిలో వృత్తి నైపుణ్యాలు పెంచితే ఆయా కంపెనీలు ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి దత్తాత్రేయ, మంత్రులు కడియం శ్రీహరి, నాయిని నర్‌ఇంహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.