తెలంగాణలో మెరుగైన రైల్వే సేవలు

3

– సీఎం కేసీఆర్‌తో ఎస్‌సీఆర్‌ జనరల్‌ మేనేజర్‌ భేటి

హైదరాబాద్‌,డిసెంబర్‌4(జనంసాక్షి):

ఔటర్‌ రింగ్‌ రోడ్డు దగ్గర ఉన్న చర్లపల్లి, నాగులపల్లి ప్రాంతాల్లో రైల్వే జంక్షన్లను అభివృద్ధి చేయాలని సిఎం కెసిఆర్‌ దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ రవీంద్ర గుప్తతో అన్నారు. అందుకు అవసరమైన సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ రవీంద్ర గుప్త శుక్రవారం సచివాలయంలో సీఎం కెసిఆర్‌తో భేటీ అయ్యారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం, రైల్వేశాఖ మధ్య ఉన్న అంతర్గత విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సికింద్రాబాద్‌, నాంపల్లి రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగినందున ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నగర శివారులో మరో రెండు రైల్వే జంక్షన్లను అభివృద్ధి చేయాలని కోరారు. ఢిల్లీ, చెన్నై తదితర రూట్లకు చర్లపల్లి, ముంబై రూట్‌కు నాగులపల్లి జంక్షన్‌ అనుకూలంగా ఉంటుందని అన్నారు. ఔటర్‌ రింగ్‌రోడ్డుకు సవిూపంలో ఉండటం వల్ల మరింత ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ చేసిన ప్రతిపాదనకు రవీంద్ర గుప్త సానుకూలంగా స్పందించారు. చర్లపల్లిలో ఉన్న రైల్వే శాఖ భూమికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరికొంత భూమిని కేటాయించాలని జీఎం కోరగా అందుకు సీఎం సానుకూలంగా స్పందించారు. సికింద్రాబాద్‌ నియోజకవర్గం పరిధిలో పేదల గృహ నిర్మాణానికి, ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు స్థలంలేదని, సికింద్రాబాద్‌లోని రైల్వే భూమిలో 15 ఎకరాలు ప్రభుత్వానికి కేటాయించాలని సీఎం కోరారు. అందుకు ప్రతిగా రైల్వే శాఖకు మరోచోట భూమిని కేటాయిస్తామని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా కాపలాదారులు లేని లెవెల్‌ క్రాసింగ్‌లు 150 వరకు ఉన్నాయని తెలిపారు. వాటి వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు. గత యేడాది మాసాయిపేట దుర్ఘటనలో విద్యార్థులు మరణించడం ఇప్పటికీ తనకు బాధ కలిగిస్తుందని తెలిపారు. అలాంటి ఘటనలు మళ్లీ జరుగకుండా రైల్వే లెవెల్‌ క్రాసింగ్‌ల వద్ద గేట్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

అయితే దశలవారీగా గేట్లు ఏర్పాటు చేస్తామని జీఎం హావిూ ఇచ్చారు. తుకారం గేట్‌ దగ్గర అండర్‌ బ్రిడ్జి పనులను కూడా త్వరగా చేపట్టాలని సీఎం కోరారు. సీఎం కేసీఆర్‌ ప్రతిపాదనలకు రైల్వే జీఎం సానుకూలంగా స్పందించారు.