తెలంగాణసై సీమాంధ్ర పార్టీలది ఒకే దారి

టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌
హైదరాబాద్‌, ఫిబ్రవరి 10 (జనంసాక్షి) :
తెలంగాణపై సీమాంధ్ర పార్టీలన్నింటిదీ ఒకే దారి అని, ఆ పార్టీలను నమ్మొద్దని తెలంగాణ జేఏసీ ప్రొఫెసర్‌ కోదండంరాం అన్నారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌లో తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్‌, తెలుగుదేశం, వైఎస్సార్‌ సీపీలు తెలంగాణ వ్యతిరేక పార్టీలన్నారు. తెలంగాణలోని శక్తులన్నింటినీ ఒకే తాటిపైకి తెచ్చి ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించాల్సిన అవసరముందన్నారు. తెలంగాణ ఉద్యమంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. ఈ ప్రాంత ప్రజలందరినీ ఒకే తాటిపైకి తీసుకురావడం ఉద్యమం సాధించిన విజయమని ఆయన అభివర్ణించారు. సీమాంధ్ర పెట్టుబడి మూలాలను దెబ్బకొట్టాలంటే అందుకు సహకరిస్తున్న ప్రభుత్వ వ్యవస్థలపైనే గురిపెట్టాలని తెలిపారు. పదేళ్ల ఉద్యమంలో టీవీవీ నిర్వహించిన పాత్ర కీలకమైనదని కొనియాడారు. అనంతరం ‘చర్చ’ పత్రిక ప్రచురించిన ప్రత్యేక సంచికను ఆయన ఆవిష్కరించారు. విద్యావంతుల వేదిక అధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ ఉద్యమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక ఎలాంటి పరిమితులు లేకుండా పనిచేస్తుందన్నారు. గ్రామానికి పది మంది చొప్పున తెలంగాణ వాలంటీర్స్‌ను నియమించి ఉద్యమంలో భాగస్వామ్యం చేస్తామని తెలిపారు. వేదిక ప్రధాన కార్యదర్శి పిట్టల రవీందర్‌ మాట్లాడుతూ విద్యావంతుల వేదిక నాల్గో రాష్ట్ర మహా సభలను మార్చి 24న హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు కవ్వా లక్ష్మారెడ్డి, గురిజాల రవీందర్‌రావు, కార్యదర్శులు డాక్టర్‌ డోలి సత్యనారాయణ, జమాల్‌పూర్‌ గణేశ్‌, ఆర్‌ విజయ్‌కుమార్‌, గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు శ్రీధర్‌దేశ్‌పాండే, అన్ని జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.