తెలంగాణ ఇవ్వకనే మా బిడ్డలు సచ్చిపోతుండ్రు

వాస్తవాలు కేంద్రానికి మీరైనా చెప్పుండ్రి

ఆత్మబలిదానాలు ఆగేందుకు సహకరించుండ్రి

గవర్నర్‌ వైఖరిలో మార్పు కనబడ్డది జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి7(జనంసాక్షి): తెలంగాణ విషయంలో గవర్నర్‌ నరసింహన్‌ వైఖరిలో కూడా కాస్తా మార్పు కనిపించిందని తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం అన్నారు. గురువారం తెలంగాణ జెఎసి కోదం డరాం నేతృత్వలో ఇరవై మంది బృందం రాజ్‌ భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. అనంతరం ఆయన విూడియాతో మాట్లాడుతూ తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం విధించిన డిసెంబర్‌ 28 డెడ్‌లైన్‌ ముగిసిన తర్వాత తెలంగాణలో జరిగిన ఆత్మహత్యల గురించి గవర్నర్‌కు వివరించామని కోదండరాం తెలిపారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరగడం వల్లే ఆత్మహత్యలు జరుగుతున్నాయని గవర్నర్‌కు చెప్పినట్టు వివరించారు. దానిపై స్పందించిన గవర్నర్‌ తెలంగాణ కోసం ఆత్మహత్యలకు పాల్పడవద్దని తన మాటగా చెప్పాలని గవర్నర్‌ అన్నట్లు- కోదండరాం తెలిపారు. తెలంగాణపై గవర్నర్‌ సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారుకౌన్సెలింగ్‌లతో తెలంగాణలో ఆత్మహత్యలు ఆగవని కోదండరాం గవర్నర్‌కు తెలిపామన్నారు. రాజకీయ నిర్ణయం ద్వారా తెలంగాణ ఏర్పాటు- చేయడం వల్లే ఆత్మహత్యలు ఆపడం సాధ్యమని తేల్చిచెప్పారు. తెలంగాణపై కాంగ్రెస్‌ అధిష్ఠానానికి వాస్తవ నివేదికలు ఇవ్వాలని, ఢిల్లీ వెళ్లినపుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు- ఆవశ్యకతను కేంద్రానికి తెలపాలని కోదండరాం విజ్ఞప్తి చేశారు. ఇదిలావుంటే జెఎసి కార్యక్రమాలకు తెలంగాణ నగారా సమితి నాయకుడు నాగం జనార్దన్‌ రెడ్డిని ఆహ్వానించడం లేదనే వార్తలను తెలంగాణ జెఎసి చైర్మన్‌ కోదండరామ్‌ ఖండించారు. తమ కార్యక్రమాలకు నాగం జనార్దన్‌ రెడ్డిని ఆహ్వానిస్తున్నట్లు- ఆయన చెప్పారు. టిఆర్‌ఎస్‌ చెప్పినట్లు- తాము వింటున్నట్లు- నాగం చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. నాగం కూడా తమ జెఎసి సమావేశాలకు హాజరు కావాలని ఆయన అన్నారు. నాగం జనార్దన్‌ రెడ్డి కూడా తమలో ఓ సభ్యుడేనని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేత శ్రీనివాస గౌడ్‌ అన్నారు. కమిటీలో లేనంత మాత్రాన జెఎసితో నాగం జనార్దన్‌ రెడ్డికి సంబంధం లేదనడం సరికాదని ఆయన అన్నారు. నాగం జనార్దన్‌ రెడ్డి స్థాపించిన తెలంగాణ నగారా సమితిని త్వరలోనే జెఎసిలోకి తీసుకునే అంశంపై అన్ని పార్టీలతో కలిసి చర్చిస్తామని ఆయన చెప్పారు.