తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు వద్దు : అసద్‌

కోర్టుకు హాజరైన ఓవైసీ సోదరులు
హైదరాబాద్‌, ఫిబ్రవరి 8 (జనంసాక్షి): తెలంగాణ కోసం విద్యార్థులు, యువకులు ఆత్మహత్యలు చేసుకోవద్దని ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ విజ్ఞప్తి చేశారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. అధికారులను దూషించిన కేసులో అసదుద్దీన్‌ శుక్రవారం సంగారెడ్డి కోర్టుకు హాజరయ్యారు. విచరణ ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అంశాన్ని తేల్చాల్సింది కేంద్రమేనని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే తెలంగాణపై తమ వైఖరిని ప్రణబ్‌ కమిటీ, శ్రీకృష్ణ కమిటీలకు చెప్పామన్నారు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ తెలంగాణపై తమ నిర్ణయాన్ని చెప్పాయని, ఇక తేల్చాల్సింది కేంద్రమేనని పేర్కొన్నారు. సమస్యను మరింతగా నాన్చకుండా తేల్చేయాలని సూచించారు. తెలంగాణ కోసం యువత ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు.
విచారణ 22కి వాయిదా
కలెక్టర్‌ను దూషించిన కేసు విచారణను సంగారెడ్డి కోర్టు ఫిబ్రవరి 22కి వాయిదా వేసింది. కేసులో నిందితులైన ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌, ఆయన సోదరుడు, ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ శుక్రవారం కోర్టకు హాజరయ్యారు. ఆదిలాబాద్‌ జిల్లా జైలులో ఉన్న అక్బర్‌ను పోలీసులు కట్టుదిట్టమైన భద్రత నడుమ సంగారెడ్డికి తరలించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. దీంతో అక్బర్‌ను తిరిగి ఆదిలాబాద్‌ జిల్లా జైలుకు తరలించారు.