తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను విజయవంతం చేయాలి
రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్
యాదాద్రి భువనగిరి బ్యూరో జనం సాక్షి .
తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
బుధవారం నాడు ఆయన రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి, రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ అర్వింద్ కుమార్, రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈనెల 16, 17, 18 తేదీలలో నిర్వహిస్తున్న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను జిల్లాలలో సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు కట్టుదిట్టంగా నిర్వహించాలని, 16న ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో శాసనసభ్యులు, ప్రజాప్రతినిధుల సహకారంతో 15 వేల మందితో భారీ ర్యాలీ, సమావేశం నిర్వహించాలని పేర్కొన్నారు. భారీ సంఖ్యలో ప్రజలు హాజరవుతున్న నేపథ్యంలో భోజనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, అధిక సంఖ్యలో కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. 17న జిల్లా కేంద్రాల్లో ముఖ్య అతిథిచే జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని, హైదరాబాద్ లో జరిగే కొమురం భీం ఆదివాసి భవన్, సేవాలాల్ బంజారా భవనాల ప్రారంభోత్సవానికి జిల్లాకు కేటాయించిన లక్ష్యం మేరకు ఎస్.టి.లను పంపించాలని, బస్సుల ఏర్పాటు, భోజన సౌకర్యం కల్పించాలని తెలిపారు. సెప్టెంబర్ 18న జిల్లా కేంద్రాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, కళాకారులకు, స్వాతంత్ర సమరయోధులకు సన్మానం చేయాలని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి జిల్లాలో చేపట్టిన ఏర్పాట్లను వివరిస్తూ, 16న జిల్లాలో ఉన్న 2 అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలలో 15 వేల మంది చొప్పున భారీ ర్యాలీ నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసామని తెలిపారు. ర్యాలీ అనంతరం భోజనం ఏర్పాటు కోసం అవసరమైన మేర కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి కౌంటర్ వద్ద అధికారులకు బాధ్యత అప్పగించామని తెలిపారు. 17 వ తేదీన జిల్లాలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. జిల్లా నుంచి ఎస్టీ ప్రతినిధులు, ఎస్.టి ఉద్యోగులు, ఎస్.టి. స్వయం సహాయక సంఘాల మహిళా ప్రతినిధులు కలిపి మొత్తం 1000 మందిని 27 బస్సుల ద్వారా పంపిస్తున్నామని, వారికి అవసరమైన త్రాగునీరు, భోజన సౌకర్యాలు ఏర్పాటు చేసామని, సకాలంలో హైదరాబాద్ చేరే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సెప్టెంబర్ 18న జిల్లా కేంద్రంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి, ఏసిపి వెంకట్ రెడ్డి , రెవిన్యూ డివిజనల్ అధికారులు భూపాల్ రెడ్డి, సూరజ్ కుమార్, జిల్లా పరిషత్ సీఈవో కృష్ణారెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఉపేందర్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సునంద, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి మంగ్తా నాయక్, జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరెడ్డి, జిల్లా రవాణా అధికారి, ఎస్సీ కార్పొరేషన్ ఇ.డి. శ్యాంసుందర్, కలెక్టరేట్ పరిపాలన అధికారి నాగేశ్వరరావు చారి, ఇంటర్మీడియట్ నోడల్ రమణి, జిల్లా యువజన సంక్షేమ అధికారి ధనుంజయ ఆర్.బి. ఎస్.కే. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ వినోద్, ఆర్టీసీ డిఎం శ్రీనివాస్, ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శంకరయ్య, జిల్లా పౌర సంబంధాల అధికారి పి.వెంకటేశ్వరరావు, అధికారులు పాల్గొన్నారు.