తెలంగాణ తీర్మానానికి పట్టుబట్టిన టీఆర్‌ఎస్‌

కుదరదన్న సీఎం
జాతీయ జెండాలతో హాజరైన టీఆర్‌ఎస్‌, బీజేపీ
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 17(జనంసాక్షి):
అంతా అనుకున్నట్లుగానే జరిగింది. ఎలాంటి చర్చ జగరకుండానే అసెంబ్లీ తొలిరోజు ముగిసింది. విపక్షాల నినాదాలతో దద్దరిల్లింది. తొలి రోజే తెలంగాణ నినాదాలతో సభ మార్మోగింది. సమావేశాలు ప్రారంభమై పట్టుమని పది నిమిషాలు కాకముందే, సభ్యులంతా స్థానాల్లో కూర్చొక ముందే మంగళవారానికి వాయిదా పడింది. ఐదు రోజుల పాటు జరిగే సమావేశాల్లో మొదటి రోజు వృథాగా పోయింది. సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఎలాంటి చర్చ చేపట్టకుండానే తొలి రోజు వాయిదా పడింది. విద్యుత్‌ సమస్యపై చర్చించా లని తెలుగుదేశం, తెలంగాణ తీర్మానం చేయాలం టూ టీఆర్‌ఎస్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చ చేపట్టాలని వైఎస్సార్‌ సీపీ, ఎంఐఎం, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని బీజేపీ, నాగం జనార్ధన్‌రెడ్డి, పింఛన్‌ చెల్లింపుల్లో తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధులకు జరుగుతున్న అన్యాయంపై సీపీఐ వాయిదా తీర్మానాలిచ్చాయి. ఉదయం సభ ప్రారంభం కాగానే విపక్షాల వాయిదా తీర్మానాలను తిరస్క రిస్తున్నట్లు స్పీకర్‌ మనోహర్‌ ప్రకటించారు. ప్రశ్నోత్తరాలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడంతో విపక్షాలు సభలో ఆందోళనకు దిగాయి. స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టాయి. తెలంగాణపై తీర్మానం ప్రవేశపెట్టాలని టీఆర్‌ఎస్‌, విద్యుత్‌ సమస్యపై తక్షణమే చర్చ చేపట్టాలని టీడీపీ, తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరపాలని బీజేపీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై బీజేపీ, డీజిల్‌ ధరల పెంపుపై వామపక్షాల ఎమ్మెల్యేలు స్పీకర్‌ పోడియంలోకి దూసుకెళ్లారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ, టీ-టీడీపీ సభ్యులు తెలంగాణ నినాదాలతో ¬రెత్తించారు. తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరపాలని బీజేపీ సభ్యులు సభలో జాతీయ పతాకాలు పట్టుకొని డిమాండ్‌ చేయగా, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చించాలంటూ వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు ప్లకార్డులు పట్టుకొని నినదించారు. సభా సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్‌ పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ, విపక్షాలు ఆందోళన విరమించలేదు. గందరోళం నెలకొనడంతో మనోహర్‌ సభను గంట పాటు వాయిదా వేశారు. దీంతో ప్రారంభమైన పదినిమిషాలకే సభ వాయిదా పడింది. వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన తర్వాత.. విద్యుత్‌ సంక్షోభంపై స్వల్పకాలిక చర్చ చేపట్టేందుకు స్పీకర్‌ అనుమతించారు. ప్రశ్నోత్తరాలు రద్దు చేసి, విద్యుత్‌ సమస్యలపై స్వల్పకాలిక చర్చ ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. అయితే, తెలంగాణపై తీర్మానం చేయాలంటూ టీఆర్‌ఎస్‌, సీపీఐ సభ్యులు అడ్డుకున్నారు. స్పీకర్‌ పోడియం వద్దకు వెళ్లి నిరసనకు దిగారు. సభ రెండోసారి వాయిదా పడిన అనంతరం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో పాటు నాగం జనార్దన్‌రెడ్డి తదితరులు అసెంబ్లీలోని గాంధీ విగ్రహం ఎదుట బైఠాయించారు. తెలంగాణ విమోచనాన్ని అధికారికంగా జరపాలని డిమాండ్‌ చేస్తూ నాగం జనార్దన్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానాన్ని చేయలేమని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఒకవేళ తీర్మానాన్ని ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టినప్పటికీ అది వీగిపోతుందని సీఎం కిరణ్‌ అన్నారు. తెలంగాణ విషయంలో రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు రెండు చీలిపోయాయని, ఈ పరిస్థితుల్లో తీర్మానం సాధ్యం కాదని ఆయన చెప్పారు. తెలంగాణ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిందిగా తాను కూడా అనేక సార్లు కేంద్రాన్ని కోరినట్లు సీఎం చెప్పారు. సోమవారం సభ వాయిదాపడిన తరువాత సీఎం విూడియాతో మాట్లాడారు. తెలంగాణపై గతంలో జరిగిన చర్చలు, వాటి వివరాలు కేంద్రం వద్ద ఉన్నాయని, అన్ని విషయాలను పరిశీలించి కేంద్రమే నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు. మంత్రి ధర్మాన ప్రసాద రావు రాజీనామా వ్యవహారం, తెలంగాణ అంశం, కోదండరామ్‌ వ్యాఖ్యలు తదితర అంశాలపై స్పందించారు. సెప్టెంబర్‌ 17వ తేదీ రోజున విమోచన దినాన్ని కూడా అధికారికంగా ప్రభుత్వం నిర్వహించలేదన్నారు. తెలంగాణ అనేది సున్నితమైన అంశమని, దానిపై నిర్ణయం తీసుకోవడానికి అన్ని రకాలుగా ఆలోచించాల్సి ఉంటుందన్నారు. జీవ వైవిధ్య సదస్సు నేపథ్యంలో తెలంగాణవాదులు తెలంగాణ మార్చ్‌ను ఉపసంహరించుకోవాలని కోరారు.
తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్‌ ఆచార్య కోదండరామ్‌ వ్యాఖ్యలపై కిరణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టపరిధి దాటి ఎవరు వ్యాఖ్యలు చేసినా ఉపేక్షించేది లేదన్నారు. అలాంటి వ్యాఖ్యలు చేసిన వారు ఎంత పెద్దవారైనా ఊరుకోమన్నారు. వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి మార్పు అంటూ వస్తున్నవన్నీ ఊహాగానాలే అని కొట్టి పారేశారు. పార్టీ అధిష్టానం మార్పు గురించి ఆలోచించడం లేదన్నారు. మార్పు అంశం కేవలం మహారాష్ట్రకు సంబంధించిందన్నారు. మంత్రి ధర్మాన ప్రసాద రావును వివరణ అడిగిన తర్వాత ఆయన రాజీనామాపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. సిబిఐ కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ధర్మాన వివరణ కోరతానన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించక పోవడం వల్ల రాష్టాన్రికి రావాల్సిన రూ.2వేల కోట్ల నిధులు ఆగిపోయాయయన్నారు. ఎన్నికల విషయంలో కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేశామని, ఆ కమిటీ పరిశీలన తర్వాత ఎన్నికలపై నిర్ణయం ఉంటుందన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ రోజు రోజుకు పెరుగుతోందన్నారు. 264 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ డిమాండ్‌ ప్రస్తుతం రాష్ట్రంలో ఉందన్నారు. జల విద్యుత్‌ సరఫరా తగ్గిందని చెప్పారు. గ్యాస్‌, బొగ్గు కొరతతో విద్యుత్‌ సమస్య మరింత తీవ్రమైందన్నారు. బాబ్లీ సమస్యపై స్పందిస్తు మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడితే ఈ సమస్య తీరుతుందని, ఈ విషయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన అవసరం ఏముందని సీఎం చెప్పారు. గ్యాస్‌, డీజిల్‌ అదనపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించలేదని ఆయన స్పష్టం చేశారు. విూడియా ముందు సమస్యలపై ఉపన్యాసాలు ఇస్తున్న విపక్ష సభ్యులు సభలో ఆ విషయాలపై సమగ్రంగా చర్చిస్తే ప్రజలకు మేలు జరుగుతుందని సీఎం అన్నారు. అయితే సోమవారం సభలో విపక్షాలు ప్రదర్శించిన తీరు ఆందోళన కలిగిస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారని, దానిపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. కానీ విపక్షాలు సహకరించడం లేదని సీఎం చెప్పారు.